మణికొండ, జూలై 24 : నార్సింగి మున్సిపాలిటీ మంచిరేవుల గ్రేహౌండ్స్‌లో చిరుతపులి కలకలం రేపుతోంది. నాలుగు రోజుల క్రితం చిల్కూరు సమీపంలో అటవీప్రాంతం నుంచి గ్రేహౌండ్స్ క్యాంపు సమీపంలోకి వచ్చినట్లుగా గ్రేహౌండ్స్ పోలీసు సిబ్బంది తెలిపారు. దీంతో అప్రమత్తమైన అటవీశాఖ అధికారులు సీసీ కెమెరాలతో నిఘా పెట్టారు.
గురువారం తెల్లవారుజామున చిరుతపులి కన్పించినట్లు పోలీసు కానిస్టేబుళ్లు తెలిపారు. అది సంచరిస్తున్న ప్రాంతాలు కూడా సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. అటవీశాఖ అధికారుల బృందం మంచిరేవులలో గ్రేహౌండ్స్ అటవీప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టారు. సాయంత్రం వరకు ఎక్కడ చిరుత ఆచూకీ లభించలేదని కనిపిస్తే వెంటనే పట్టుకునేందుకు అవసరమైన ఏర్పాట్లతో సిద్ధంగా ఉన్నామని అటవీశాఖ అధికారులు తెలిపారు.