సిటీబ్యూరో, జూలై 4 (నమస్తే తెలంగాణ) : ఆర్టీఏ కార్యాలయాలు అక్రమార్జనకు నిలయాలుగా మారుతున్నాయని వాహనదారులు విమర్శిస్తున్నారు. సేవలు పొందడానికి వచ్చే వాహనదారులు ఏజెంట్లను ఆశ్రయిస్తే తప్ప.. పనికాకుండా కొంతమంది అధికారులు చక్రం తిప్పుతున్నారు. నేరుగా వచ్చే వాహనదారుల దరఖాస్తు ప్రక్రియలో ఏదో ఒక మెలికపెట్టి ఆ పని కాకుండా నిలిపివేస్తున్నారు. చివరికి ఆ వాహనదారుడు అక్కడే ఉన్న దళారీని ఆశ్రయించి అడిగినంత డబ్బు ముట్ట జెబితే ఏదైతే పని కాదని అన్నారో.. అదే పనిని నిమిషాల వ్యవధిలో పూర్తి చేస్తున్నారని రవి అనే వాహనదారుడు తెలిపాడు.
రమేశ్ అనే యువకుడు ఇబ్రహీంపట్నంలోని ఆర్టీఏ కార్యాలయంలో లైసెన్స్‌కు దరఖాస్తు చేశాడు. అతడికి లెర్నింగ్ టెస్ట్ నిర్వహించాల్సిన అధికారులు కంప్యూటర్‌పై కూర్చొబెట్టి పక్కనే ఉన్న ఆపరేటర్ ఆ పరీక్షను పూర్తి చేశాడు. ఈ తతంగమంతా ఎంవీఐల ముందే జరుగుతున్నది. అయినా వాళ్లు పెద్దగా పట్టించుకోరు. కారణం అతడు తీసుకొచ్చిన స్లాట్ పేపర్‌పై ఏజెంట్ కోడ్ ఉంటుంది. దీంతో అతడు డబ్బులిచ్చాడనే సంకేతం తెలుస్తుంది.
అతడిని లెర్నింగ్ టెస్ట్‌లో పాస్ చేయించి లెర్నింగ్ లైసెన్స్ ఇచ్చేశారు. ఇదే ప్రక్రియలో ఏజెంట్లతో సంబంధం లేకుండా వెళ్లిన మరో యువకుడు ప్రసాద్ పరీక్షలో ఫెయిల్ అయ్యాడు. ఏ కంప్యూటర్ ఆపరేటర్ అతడికి సహకరించలేదు. ఇలా ఏజెంట్లను ఆశ్రయించిన వారికి మాత్రమే వాహన సేవలు అందుతున్నాయని నగరవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే రంగారెడ్డి పరిధిలోని మణికొండ, ఇబ్రహీంపట్నంలో ఏజెంట్లు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని రవాణా శాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందాయి. ఆయా కార్యాలయాల్లో ఎలాంటి పరిస్థితి ఉందో తెలుసుకోవడానికి అంతర్గతంగా ఓ టీమ్ అధికారులకు రిపోర్ట్ ఇచ్చింది.
డ్రైవింగ్ నిబంధనలపై అవగాహన లేని వారికి లైసెన్స్‌లు జారీ చేయడం ప్రాణాలతో చెలగాటమాడటమే అని వాహనదారులు చెబుతున్నారు. డబ్బులకు ఆశపడి డ్రైవింగ్ లైసెన్స్ ఇప్పిస్తే అతడి వల్ల వాహనదారులకు ప్రమాదం ఉంటుందన్నారు. లెర్నింగ్ పరీక్షకు రూ. వెయ్యి తీసుకుని పాస్ చేస్తున్నారని, డ్రైవింగ్ టెస్ట్ సమయంలో మరో వెయ్యి తీసుకొని సర్టిఫికెట్ అందిస్తున్నారని వాహనదారులు చెబుతున్నారు.
ఇలా రోడ్డు నిబంధనలపై అవగాహన లేనివారిని డ్రైవింగ్‌కు అనుమతినిస్తే ప్రమాదకరమని తెలిసినా ఆర్టీఏ అధికారులు చోద్యం చూస్తున్నారు. అతివేగం, ర్యాష్ డ్రైవింగ్, నిర్లక్ష్యపు డ్రైవింగ్ చేస్తూ చాలా మంది రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్నారు. అనేక కుంటుంబాల్లో తీరని శోఖానికి బాధ్యులవుతున్నారు. ఆర్టీఏ కార్యాలయాల్లో ఏజెంట్ల దందాను కొంతమంది అధికారులు తమ జేబులు నింపుకోవడానికి కావాలనే ప్రోత్సహిస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. వీటిపై ఉన్నతాధికారులు రిపోర్ట్ తీసుకున్నారు. త్వరలో కొందరు అధికారులపై శాఖపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది.