మన్సురాబాద్, మే 7: ప్రమాదవశాత్తు జరిగిన అగ్ని ప్రమాదంలో ఇండ్లను కోల్పోయిన సాయి నగర్ గుడిసెవాసులకు అండగా ఉంటానని ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి తెలిపారు. నాగోల్ డివిజన్ పరిధి సాయి నగర్ గుడిసెల్లో జరిగిన అగ్ని ప్రమాదంలో సర్వస్వం కోల్పోయిన బాధితులను బుధవారం మరోసారి ఆయన పరామర్శించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి మాట్లాడుతూ.. బాధితులకు ప్రభుత్వం తరఫున అందాల్సిన సదుపాయాలు ఇప్పించే బాధ్యత తనదేనని స్పష్టం చేశారు. అగ్నిప్రమాదంలో ఇళ్లు కోల్పోయిన వారికి తక్షణ సహాయం కింద రూ. 8 వేలు అందజేయడం జరుగుతుందని అన్నారు. ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద ఇప్పటికే కొందరు దరఖాస్తు చేసుకున్నట్టు తెలిసిందని.. మిగతా వారు సైతం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. కలెక్టర్‌తో మాట్లాడి ప్రతి ఒక్కరూ ఇల్లు కట్టుకునే విధంగా ఆర్థిక సహాయం అందింపజేస్తామని చెప్పారు. మంటల్లో కాలిపోయిన ఇంటి పట్టాల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. పట్టాలు లేని వారికి ప్రతి ఒక్కరికి పట్టాలు ఇప్పించడం జరుగుతుందని స్పష్టం చేశారు. అనంతరం బాధితులకు అల్పాహారాన్ని పంపిణీ చేశారు.