Hyderabad | ఎల్బీనగర్లో ప్రేమోన్మాది ఘాతుకానికి తెగబడ్డాడు. ఇంట్లోకి చొరబడి అక్కాతమ్ముడిపై విచక్షణరహితంగా కత్తితో దాడికి దిగాడు. ఈ ఘటనలో తమ్ముడు మరణించగా.. తీవ్రంగా గాయపడిన అక్క ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. అక్కాతమ్ముడిపై దాడికి పాల్పడటం చూసిన స్థానికులు సదరు ప్రేమోన్మాదిని ఓ ఇంట్లో బంధించి.. పోలీసులకు అప్పగించారు. ఈ క్రమంలో ఎల్బీనగర్ డీసీపీ సాయిశ్రీ ఈ కేసుకు సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించారు.
ఎల్బీనగర్ ఆర్టీసీ కాలనీకి చెందిన సంఘవి హోమియో వైద్యురాలు. ఆమె తమ్ముడు చింటూ బీటెక్ చదువుతున్నాడు. కొంతకాలంగా శివకుమార్ అనే వ్యక్తి ప్రేమ పేరుతో సంఘవిని వేధిస్తున్నాడు. ఈ క్రమంలోనే మధ్యాహ్నం 2.45 గంటల ప్రాంతంలో సంఘవి ఇంటికి శివకుమార్ వచ్చాడు. ఆమెతో గొడవకు దిగాడు. మాటామాట పెరగడంతో ఆగ్రహానికి గురైన శివకుమార్.. ఇంట్లో ఉన్న కత్తి తీసుకుని చింటు, సంఘవిపై దాడికి తెగబడ్డాడు. ఈ ఘటనలో గాయపడ్డ చింటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడని ఎల్బీనగర్ డీసీపీ తెలిపారు. కత్తిపోట్లతో తీవ్రంగా గాయపడిన సంఘవిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించామని చెప్పారు. సంఘవి కోలుకున్న తర్వాత గొడవకు కారణాలు తెలుస్తాయని పేర్కొన్నారు. నిందితుడు శివకుమార్‌ను విచారిస్తున్నామని.. అతనికి ఉన్న నేర చరిత్రపై కూడా దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు. కాగా సంఘవి, శివకుమార్ కొంతకాలంగా ప్రేమలో ఉన్నారని.. అయితే ఆమె పెండ్లికి నిరాకరించడంతోనే శివకుమార్ ఇంతటి ఘాతుకానికి తెగబడ్డాడని స్థానికులు చెబుతున్నారు.