గోల్నాక, మే 21: నవ మాసాలు మోసింది.. అల్లారుముద్దుగా పెంచి పెద్ద చేసింది.. అయినప్పటికీ ఆ బిడ్డలకు కన్న తల్లి భారమైంది. వారు సరిగా చూడటం లేదని ఇల్లు విడిచి వచ్చింది. వారికి దూరంగా ఉంటూ.. యాచిస్తూ.. జీవన పోరాటం చేసింది. అనారోగ్యంలో అలమటిస్తూ.. దిక్కులేని స్థితిలో ప్రాణాలు వదిలింది. మృతి చెంది మూడు రోజులైనా ఎవరూ చూడకపోవడంతో పందికొక్కులు పీక్కుతిన్నాయి. తీవ్ర దుర్గంధం వెలువడుతున్న ఆ వృద్ధురాలి మృతదేహాన్ని అనాథ శవంగా భావించి స్థానికులు జీహెచ్ఎంసీ సిబ్బందికి అప్పగించగా అప్పుడు ఆమె బలగం ప్రత్యక్షమైంది. అప్పుడు తెలిసింది.. ఎవరూ లేని అనాథ కాదు.. అందరూ ఉన్న అభాగ్యురాలని. అయినా.. ఆ బలగం అంత్యక్రియల ఖర్చులకు వెనుకడుగు వేసింది. చివరకు ఎమ్మెల్యే ఆర్థిక సాయంతో అంతిమ సంస్కారాలు జరిగాయి. ఈ హృదయ విధారక సంఘటన అంబర్పేటలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
వివరాల్లోకి వెళితే… ఆమె పేరు నర్సమ్మ (90).. గత కొన్నేండ్ల కిందట ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు కానీ.. అంబర్పేట సునార్బౌలిలో ఓ చిన్న గుడిసె వేసుకొని ఆశ్రయం పొందుతూ స్థానికంగా యాచిస్తూ జీవన పోరాటం చేసింది.. కాగా గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యానికి గురైన ఆమె గుడిసెలో తిండి తిప్పలు లేకుండా నరకం అనుభవిస్తూ జీవశ్చవంగా మారి మృత్యువుతో పోరాడి శుక్రవారం మృతి చెందింది. కాగా ఆదివారం ఉదయం నర్సమ్మ గుడిసెలోనుంచి తీవ్ర దుర్వాసన రావడంతో ఇది గమనించిన స్థానికులు వెళ్లి చూడగా కుళ్లిన స్థితిలో పడిఉన్న వృద్ధురాలి మృతదేహాన్ని పందికొక్కులు పీక్కు తింటున్న వైనాన్ని చూసి చలించి పోయారు. వెంటనే ఈ విషయాన్ని స్థానిక కార్పొరేటర్ ఇ.విజయ్కుమార్గౌడ్ దృష్టికి తీసుకుపోయారు. ఆయన అనాథ శవంగా భావించి జీహెచ్ఎంసీ అధికారులకు సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడికి చేరుకున్న జీహెచ్ఎంసీ సిబ్బంది మృతదేహాన్ని తరలిస్తుండగా.. ఒక్కసారిగా వృద్ధురాలి కొడుకులు, బిడ్డలతో పాటు సుమారు 60 మంది బంధువులు అక్కడ ప్రత్యక్షమయ్యారు. దీంతో స్థానికులు నివ్వెరపోయి ఇన్ని రోజులు నర్సమ్మ ఎవరూ లేని అనాథ అనుకున్నాం.. కానీ అందరూ ఉన్న అభాగ్యురాలు అనుకోలేదని చర్చించుకున్నారు. చివరకు ఆఖరి చూపునకు హాజరైన నర్సమ్మ బలగం.. అంత్యక్రియల ఖర్చుకు మాత్రం ముందుకు రాకపోవడంతో స్థానికులు ఈ విషయాన్ని స్థానిక ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ దృష్టికి తీసుకువెళ్లారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే… అంత్యక్రియలకు ఆర్థిక సాయం అందజేయడంతో ఆదివారం సాయంత్రం కాచిగూడ హిందూ శ్మశాన వాటికలో నర్సమ్మ అంత్యక్రియలు నిర్వహించారు. కాగా నర్సమ్మ కొడుకులు, బంధువులు ఎక్కడుంటారు ? ఎందుకు ఆమెను వదిలేశారన్న సమాచారం మాత్రం తెలియరాలేదు.