బేగంపేట, జూలై 12: సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి బోనాల జాతరను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు దేవాదాయశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు. ప్రభుత్వ శాఖల వివిధ అధికారులు భక్తులకు కావాల్సిన ఏర్పాట్లు శనివారం సాయంత్రానికే పూర్తి చేశారు. ప్రధానంగా భక్తులు ఆలయానికి చేరుకోవడానికి ఆరు క్యూలైన్లను పటిష్టంగా ఏర్పాటు చేశారు. నేడు (ఆదివారం) ఉజ్జయినీ మహంకాళి అమ్మవారికి బోనాల సమర్పణ, సోమవారం రంగం వేడుకలు.. అంబారీపై అమ్మవారి ఊరేగింపు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో దేవాలయాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు.
అమ్మవారి జాతరను తిలకించేందుకు వచ్చే భక్తుల కోసం నగరం నలు మూలల నుంచి ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేశారు. అలాగే దేవాలయం సమీప ప్రాంతాల్లో వాహనాల పార్కింగ్ సదుపాయాన్ని కల్పించారు. ప్రధానంగా జాతరలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీస్ విభాగం నుంచి సుమారు 2500 వందల మంది. వివిధ విభాగాల పోలీస్ అధికారులు, సిబ్బంది బందోబస్తులో పాల్గొంటున్నట్టు డీసీసీ సాధన రష్మీ తెలిపారు. దేవాలయానికి వచ్చిన భక్తులు అమ్మవారి దర్శనార్థం బయటకు వెళ్లేందుకు రెండు ద్వారాలను ఏర్పాటు చేశారు.
కాగా, ఆదివారం మహంకాళి బోనాలకు ఉదయం 4.10 గంటలకు ప్రత్యేక పూజ కార్యక్రమాలు జరుగుతాయి. ఆలయ ధర్మకర్త కుటుంబం నుంచి అమ్మవారికి తొలిబోనం సమర్పిస్తారు. సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టు వస్ర్తాలు సమర్పిస్తారని అధికారులు తెలిపారు. సోమవారం రంగంతో పాటు ఆదివారం రాత్రి, సోమవారం అమ్మవారి ఫలహారబండ్ల ఊరేగింపు ఉంటుంది. మొత్తం 70 సీసీ కెమెరాల నడుమ 2500 మంది పోలీసు బందోబస్తుతో జాతర ప్రశాంతంగా జరిగేలా ఏర్పాటు చేసినట్లు డీసీపీ రశ్మీపెరుమాళ్ తెలిపారు.