ఖైరతాబాద్, మే 31 : డిగ్రీ విద్యలో భాషా విధానాన్ని కొనసాగించాలని ప్రొఫెసర్ హరగోపాల్ కోరారు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కవి, రచయిత నందిని సిధారెడ్డితో కలిసి మాట్లాడారు. యూజీసీ సూచనల మేరకు అంటూ తెలంగాణ ఉన్నత విద్యామండలి డిగ్రీ తృతీయ సంవత్సరంలో భాషను తొలగించాలనుకోవడం సరికాదని అన్నారు. అంతేకాకుండా 150 క్రెడిట్స్ (తరగతులు) నుంచి 125 తరగతులను కుదించారని, ఫలితంగా విద్యార్థులపై ప్రభావం పడుతుందని తెలిపారు.
భాషా బోధన లేకుండా మానవీయ, నైతిక విలువల బోధన ప్రత్యేకంగా సాధ్యపడదని ప్రొఫెసర్ హరగోపాల్ అన్నారు. విద్యారంగంలో ఏ సంస్కరణ చేసినా ఆ వ్యవస్థలో భాగస్వాములైన వారితో సంప్రదింపులు చేయాలని, కానీ ఏపకక్షంగా నిర్ణయం తీసుకోవడం అప్రజాస్వామికమని అభిప్రాయపడ్డారు. ఉన్నత విద్యామండలి విద్యార్థుల్లో భాషా నైపుణ్యాన్ని పెంపొందించేందుకు కృషి చేయాలి తప్ప దానిని నిర్వీర్యం చేయాలనుకోవడాన్ని మానుకోవాలని హితవుపలికారు. ఈ సమావేశంలో పాలమూరు అధ్యయన వేదిక ప్రతినిధి రాఘవచార్యులు, సిటీ కళాశాల తెలుగు విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ నీరజ, ఆంగ్ల విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ ఆది రమేశ్, ప్రభుత్వ డిగ్రీ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.