బంజారాహిల్స్, మార్చి 23: హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 10లోని పలు బస్తీలు, కాలనీల్లో నాణ్యమైన విద్యుత్‌ను అందించేందుకు టీజీపీడీసీఎల్ ఆధ్వర్యంలో కొత్తగా 33/11 కేవీ ఇండోర్ సబ్ స్టేషన్‌ను నిర్మించనున్నారు. దీనికోసం షేక్‌పేట మండలం సర్వే నంబర్ 403, టీఎస్ నెం.4, బ్లాక్-జీ వార్డు 10లో 1500 గజాల స్థలాన్ని కేటాయించారు.
సబ్‌స్టేషన్ నిర్మాణం కోసం గత ఏడాది డిసెంబర్లో విద్యుత్ శాఖ నుంచి ప్రతిపాదనలు వచ్చాయి. దీంతో నెలన్నర క్రితం షేక్‌పేట రెవెన్యూ అధికారులు పంచనామా చేసి స్థలాన్ని విద్యుత్ శాఖకు అప్పగించారు. ఇక్కడ సుమారు 4 కోట్ల వ్యయంతో సబ్ స్టేషన్ నిర్మాణం కోసం మాస్టర్ ప్లాన్ విభాగం ప్రణాళికలు రూపొందిస్తోంది. కాగా ఈ సబ్ స్టేషన్ నిర్మాణంకోసం స్థలం కేటాయింపు విషయంలో తనకు ఏ మాత్రం సమాచారం ఇవ్వకుండా రెవెన్యూశాఖ, విద్యుత్‌శాఖ నిర్ణయం తీసుకోవడంపై నాలుగురోజుల క్రితం ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆగ్రహం వ్యక్తం చేయడం చర్చనీయాంశంగా మారింది. తనకు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం కోసం 1000 గజాల స్థలం ఇవ్వాలంటూ ఏడాదిన్నర నుంచి అడుగుతుంటే పట్టించుకోవడం లేదని, తనకు తెలియకుండా సబ్ స్టేషన్ నిర్మిస్తే తాను ఎందుకు ఊరుకుంటానంటూ ఎమ్మెల్యే దానం నాగేందర్ హెచ్చరించిన సంగతి తెలిసిందే. దీంతో సబ్ స్టేషన్ నిర్మాణం ప్రారంభం అవుతుందా లేదా అనే విషయంపై భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
బంజారాహిల్స్ రోడ్డు నంబర్10లోని జహీరా నగర్, నంది నగర్, సింగాడకుంట, గౌరీశంకర్ కాలనీ, ఇబ్రహీంనగర్, నూర్‌నగర్ తదితర ప్రాంతాల్లో పెరిగిన విద్యుత్ అవసరాలను తీర్చేందుకు కొత్త సబ్‌స్టేషన్ నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందిస్తుండగా స్థానిక ఎమ్మెల్యే అభ్యంతరం చెప్పడంతో పనులు ముందుకు సాగుతాయా లేదా అనే అనుమానాలు మొదలయ్యాయి. ఇక్కడ సబ్ స్టేషన్ నిర్మిస్తే అత్యవసర పరిస్థితుల్లో సమీపంలోని సబ్ స్టేషన్ల పరిధిలో సైతం నాణ్యమైన విద్యుత్‌ను అందించగలుగుతామని విద్యుత్‌శాఖ అధికారులు తెలిపారు. మొత్తం మీద ఎమ్మెల్యే దానం నాగేందర్ అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యల అనంతరం సబ్ స్టేషన్ నిర్మాణం జరుగుతుందా.. లేకపోతే ఎమ్మెల్యే ఒత్తిడితో ఈ స్థలాన్ని క్యాంపు కార్యాలయానికి కేటాయిస్తారా అని స్థానికంగా ఉత్కంఠ నెలకొంది.