కొండాపూర్, మే 26 : నెల రోజులుగా ఓ వ్యక్తికి చికిత్స పేరుతో కుటుంబ సభ్యుల నుంచి లక్షల్లో వసూళ్లు చేసిన వైద్యులు, చివరకు రోగి పరిస్థితి విషమంగా ఉందంటూ చేతులెత్తేశారు. రోగి కుటుంబ సభ్యులు దవఖాన తీరుపై రంగారెడ్డి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు మంగళవారం మదీనగూడలోని అర్చన దవఖానకు చేరుకొని రోగికి అందించిన చికిత్సపై ఆరా తీశారు. రోగి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. సంగారెడ్డి జిల్లా కోహిర్ మండలం మనియార్‌పల్లి గ్రామానికి చెందిన సంతోష్ (32)కు ప్రైవేట్ పార్ట్ వద్ద చిన్న గడ్డ అవ్వడంతో చందానగర్‌లోని చెన్నారెడ్డి దవఖానకు వచ్చారు.
అకడి డాక్టర్లు సర్జరీ చేసి గడ్డను తొలగించారు. రెగ్యులర్ చెకప్ కోసం రెండు రోజుల తర్వాత దవఖానకు వస్తే క్రియాటిన్ తకువగా ఉందని, వెంటనే మదీనగూడలోని అర్చన దవఖానలో చేరాలంటూ సూచించడంతో కుటుంబ సభ్యులు సంతోష్‌ను ఏప్రిల్ 14వ తేదిన దవఖానలో చేర్చారు. డాక్టర్ వెంకటేశ్వర్రావు కట్టా పర్యవేక్షనలో సంతోష్‌కు క్రియాటిన్ తకువగా ఉందని డయాలసిస్ చేపట్టారు. ఆ ప్రభావం గుండె, ఊపిరితిత్తులపై పడి ఇన్ఫెక్షన్ అయ్యిందని చెప్పారు. అలా చికిత్స పేరిట ఇప్పటి వరకు రూ.15 లక్షల వరకు డబ్బు కట్టించుకున్నారు.
మరింత మెరుగైన చికిత్స కోసం మరిన్ని డబ్బు కట్టాలని ఒత్తిడి చేస్తున్నారని భార్య రజిత దవఖాన యాజమాన్యం తీరుపై మండిపడ్డారు. దవఖాన తీరుపై బంధువులు రంగారెడ్డి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. మంగళవారం రంగారెడ్డి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ పూర్ణిమ తన బృందంతో కలిసి అర్చన దవఖానకు చేరుకున్నారు. పేషెంట బిల్లులపై ఆరా తీసి.. సమగ్ర విచారణ జరిపి దవఖానపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. చికిత్స పేరుతో తమ నుంచి అక్రమంగా వసూల్ చేసిన డబ్బులుని తిరిగి చెల్లించాలని కుటుంబసభ్యులు డిమాండ్ చేశారు.