Lagacharla | నాంపల్లి క్రిమినల్ కోర్టులు, డిసెంబర్ 19 (నమస్తే తెలంగాణ) : లగచర్ల రైతులకు బెయిల్ మంజూరు కావడంపై లీగల్‌సెల్ న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు. కొడంగల్ నియోజకవర్గంలోని లగచర్ల రైతులపై సీఎం రేవంత్‌రెడ్డి కుట్రపూరితంగా ఇబ్బందులకు గురిచేసి జైలుకు పంపినా .. కోర్టు బెయిల్ మంజూరు చేయడంపై బీఆర్ఎస్ లీగల్ సెల్ సభ్యులు శుభప్రద్‌పటేల్, రాంచెందర్‌రావు, కిరణ్‌కుమార్, లక్ష్మణ్‌లు సంతోషం వ్యక్తం చేశారు. లగచర్ల రైతులకు రూ.9లక్షలను బీఆర్ఎస్ పార్టీ తరపున జమానత్ల రూ పంలో కోర్టులో డిపాజిట్ చేయగా… రైతులకు అండగా న్యాయపోరాటం చేసేందు సిద్ధంగా ఉన్నామని న్యాయవాదులు హామీ ఇచ్చారు.
మాజీ ఎమ్మెల్యేకు రూ.50వేల చొప్పున ఇద్దరి పూచీకత్తు, మిగతావారికి రూ.20వేల చొప్పున ఇద్దరి పూచీకత్తును డిపాజిట్ల రూపంలో ఏసీబీ కోర్టుకు సమర్పించారు. జమానత్ సమర్పించిన తర్వాత రిమాండ్ఖైదీలను విడుదల చేయాలని కోర్టు నుంచి విడుదల పత్రాలను జైలుకు పంచించారు. బెయిల్ ఉత్తర్వులో పేర్కొన్న విధంగా మాజీ ఎమ్మెల్యేతో సహా 24మంది రైతులు వారానికి ఒక్కరోజు 3నెలలపాటు బొంరాస్‌పేట్ పోలీసుల ఎదుట హాజరుకావాలని ఉత్తర్వులో పేర్కొంది. చర్లపల్లి జైలులో ఉన్న మాజీ ఎమ్మెల్యేతోపాటు రైతులు, సంగారెడ్డి జైలులో 17మంది రైతులు విడుదలయ్యారు. ముఖ్యమంతి స్వంత నియోజకవర్గం కొడంగల్‌లో కాంగ్రెస్ పట్టు సడలిందని, స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఇక ఓటమి ఖాయమని లీగల్ సెల్ సభ్యులు తెలిపారు.
బెయిల్ మంజూరుకాకుండా ప్రభుత్వం తరపున సీఎం నానా ఇబ్బందులకు గురిచేసినప్పటికీ చివరకు న్యాయమే గెలిచిందన్నారు. మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డితో సహా 24మంది రైతులను చిత్రహింసలకు గురిచేశారని తెలిపారు. పీడీపీపీ ప్రత్యేక కోర్టును నాంపల్లికి మార్చేందుకు జారీ చేసిన జీఓ ప్రకారం ప్రభుత్వం కావాలని ఆలస్యం చేసిందన్నారు. 27 జీఓ విడుదలైన నాటినుంచి ప్రభుత్వం చర్యలు తీసుకోకుండా తాత్సారం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బెయిల్ రాకుండా కస్టడీ పేరిట అధికారులపై ప్రభుత్వం ఒత్తిడి తెచ్చిందన్నారు. రైతులపై నమోదు చేసిన హత్యాయత్నంతో పాటు ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం, చట్టం ప్రకారం జోడించిన సెక్షన్లతో ఈ కేసుకు పొంతనలేదన్నారు. రాబోవు స్థానిక ఎన్నికల్లో రోటిబండతండా, లగచర్ల, పోలేపల్లి, హకీంపేట్, ఇతర గ్రామాల్లో కాంగ్రెస్‌ను ఖతం చేస్తామని రైతులు శపథం చేశారన్నారు. అభం శుభం ఎరుగని అమాయక రైతుల భూములను గుంజుకునేందుకు సీఎంతో పాటు అతని సోదరుడు తిరుపతిరెడ్డి చేస్తున్న దారుణాలపై న్యాయపోరాటం చేస్తామని బీఆర్ఎస్ పార్టీ లీగల్ సెల్ న్యాయవాదులు ధీమా వ్యక్తం చేశారు.