సిటీబ్యూరో, మే 8 (నమస్తే తెలంగాణ): ఏఐ యుగంలోనూ ఆడపిల్లకు వివక్ష తప్పడం లేదు. కారణాలేమైనా నేటికీ చాలా మంది దంపతులు ఆడపిల్ల అంటే అబార్షన్ అంటున్నారు. అందుకోసం కొన్ని ప్రైవేటు స్కానింగ్ సెంటర్లు, దవాఖానలను ఆశ్రయిస్తున్నారు. ప్రైవేటు దవాఖానలు లేదా స్కానింగ్ సెంటర్లలో లింగ నిర్ధారణ పరీక్షలు చేయించుకుని, పుట్టబోయే బిడ్డ ఆడపిల్ల అని తెలిస్తే వెంటనే అబార్షన్ చేయించుకుంటున్నట్లు సమాచారం.
ఇలాంటి దంపతులను ఆసరాగా చేసుకుని హైదరాబాద్‌తో పాటు నగర శివార్లలోని రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాల పరిధిలో ఉన్న పలు ప్రైవేటు దవాఖానలు, స్కానింగ్ సెంటర్ల నిర్వాహకులు పెద్ద ఎత్తున సొమ్ము చేసుకుంటున్నారు. గుట్టుచప్పుడు కాకుండా లింగ నిర్ధారణ పరీక్షలు చేయడం, నిబంధనలకు విరుద్ధంగా అబార్షన్లు చేయడం వంటి చర్యలకు పాల్పడుతున్నా సంబంధిత అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సరైన పర్యవేక్షణ లేకపోవడం, నెలవారీ ఒప్పందాలతో కొన్ని ప్రైవేటు దవాఖానలు, స్కానింగ్ సెంటర్లు, డయాగ్నోస్టిక్ సెంటర్ల నిర్వాహకులు ఆడిందే ఆట, పాడిందే పాటగా మారింది.
ఏవైన ఫిర్యాదులు అందినప్పుడుగాని, ఆరోపణలు వచ్చినప్పుడు మాత్రమే జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు మొక్కుబడి తనిఖీలు చేస్తున్నట్లు తెలుస్తోంది. నిబంధనల ప్రకారం ప్రసవాలు జరిగే ప్రతి ప్రసూతి దవాఖానతో పాటు అల్ట్రాసౌండ్ స్కానింగ్ వంటి వైద్య పరీక్షలు జరిపే ప్రతి స్కానింగ్ సెంటర్, డయాగ్నోస్టిక్ సెంటర్లపై వైద్య, ఆరోగ్యశాఖ అధికారుల సూక్ష్మ పర్యవేక్షణ ఉండాలి. దవాఖానల్లో జరిగే ప్రతి ప్రసవంతో పాటు అక్కడ నమోదు చేసుకునే గర్భిణిల వివరాలను జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారులకు సంబంధిత దవాఖాన నిర్వాహకులు సమర్పించాలి.
అంతే కాకుండా స్కానింగ్ జరిపే స్కానింగ్ సెంటర్స్, డయాగ్నోస్టిక్ సెంటర్ లేదా దవాఖానలో సైతం స్కానింగ్ కోసం సిఫారసు చేసిన వైద్యుల వివరాలతో పాటు రోగి వివరాలను సైతం ఆయా కేంద్రాల నిర్వాహకులు రికార్డుల్లో పొందుపర్చడంతో పాటు సంబంధిత అధికారులకు సమర్పించాల్సి ఉంటుంది. కానీ ముఖ్యంగా రంగారెడ్డి జిల్లా పరిధిలోని పలు ప్రైవేటు దవాఖానలు, డయాగ్నోస్టిక్ సెంటర్లలో ఈ నియమాలు పాటించడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
నగరంతో పాటు రంగారెడ్డి పరిధిలోని రాజేంద్రనగర్, సరూర్‌నగర్, శంషాబాద్, షాద్‌నగర్, శేరిలింగంపల్లి, హయత్‌నగర్, గండిపేట, చేవెళ్ల, ఆమన్‌గల్ మండలాలు, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా పరిధిలోని ఉప్పల్, అల్వాల్, బాచుపల్లి, బాలానగర్, దుండిగల్, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్, బాలానగర్ మండలాల పరిధిలో ఉన్న పలు ప్రైవేటు దవాఖానలు, స్కానింగ్ సెంటర్ల్లలో యధేచ్చగా లింగ నిర్ధారణ పరీక్షలు జరుగుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. సంబంధిత అధికారులు పర్యవేక్షణాలోపం, జిల్లా వైద్య, ఆరోగ్యశాఖకు చెందిన కొందరు సిబ్బందితో ఉన్న ప్రత్యేక ఒప్పందాలతో నిర్వాహకులు గుట్టుగా లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తూ దంపతుల నుంచి పెద్ద ఎత్తున వసూలు చేస్తున్నట్లు సమాచారం.
రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా పరిధిలో కొందరు ఆర్ఎంపీలు ఈ లింగ నిర్ధారణ పరీక్షలు, అబార్షన్లు చేయించడంలో మధ్యవర్తిత్వం వహిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. చాలా మంది ఆర్ఎంపీలు ఆయా దవాఖానలు, స్కానింగ్ సెంటర్లు, డయాగ్నోస్టిక్ సెంటర్ల నిర్వాహకులతో కుమ్మక్కై లింగ నిర్ధారణ పరీక్షలు చేయించడం, ఆడబిడ్డ అని నిర్ధారణ జరిగితే గుట్టుచప్పుడు కాకుండా అబార్షన్లు చేయించడంలో కీలక పాత్ర పోషిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరికొన్ని కార్పొరేట్ తరహా ఉన్న పెద్ద దవాఖానల్లో అక్కడ పనిచేసే కొందరు వైద్యులు, సిబ్బందే ఈ పాపం మూటగట్టుకుంటున్నట్లు సమాచారం.