ఉప్పల్, మే 22: దేశవ్యాప్తంగా కార్మికులపై జరుగుతున్న అక్రమ ట్రాన్స్ఫర్లు, వేతనాల ఆలస్యం, టార్గెట్ల పేరుతో వేధింపులు వంటి అన్యాయాలకు వ్యతిరేకంగా మే 21, 22 తేదీల్లో చేపట్టిన నిరసన కార్యక్రమాలు విజయవంతం అయ్యాయని తెలంగాణ మెడికల్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి భానుకిరణ్ అన్నారు.
దేశవ్యాప్త మెడికల్ రిప్రజెంటేటివ్స్, సీఐటీయూ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ సమ్మెలో భాగంగా గురువారం మల్లాపూర్‌లోని ఫ్రాంకోఇండియా ప్రధాన కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సతీష్ అధ్యక్షత వహించగా, తెలంగాణ మెడికల్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి భానుకిరణ్ మాట్లాడుతూ.. ఇది కేవలం ఆరంభమని, భవిష్యత్తులో పెద్దఎత్తున ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. కార్మిక కోడ్లను ఉపసంహరించుకోవాలన్నారు.
కార్మిక యూనియన్ల పాత్ర కీలకం
ధర్నాను ఉద్దేశించి మేడ్చల్ జిల్లా సీఐటీయూ ఉపాధ్యక్షుడు పి.గణేశ్ మాట్లాడుతూ.. కార్మిక యూనియన్లు చాలా కీలకమని, హక్కులను కాపాడే సాధనంగా అవి నిలుస్తాయని అన్నారు. కేంద్రం తీసుకువచ్చిన నూతన కార్మిక కోడ్ల వల్ల కార్మికుల హక్కులు తుడిచిపెట్టుకుపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. వాటిని ఉపసంహరించుకోవాలన్నారు. కార్మిక నిర్ణయాలకు వ్యతిరేకంగా కేంద్రం తీసుకువస్తున్న నూతన కోడ్లకు వ్యతిరేకంగా అన్ని రంగాల కార్మికులు జూలై 9వ తేదీన నిర్వహించనున్న అఖిలభారత సమ్మెలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పీ ప్రభాకర్, దుర్గాప్రసాద్, జగదీశ్వర్ చారి, సాయిరాం, రాజకుమార్, విజయ్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.