సిటీబ్యూరో, మార్చి 27 (నమస్తే తెలంగాణ) : నగరంలో గ్యాస్ సిలిండర్ కొరత ఇంకా వేధిస్తూనే ఉన్నది. బుకింగ్ చేసినా నిర్ణీత సమయానికి సిలిండర్లు రావడం రాలేదని వినియోగదారులు ఏజెన్సీలు చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. మరికొందరు తమ కేవైసీ అప్డేట్ చేసేందుకు ఏజెన్సీలను సంప్రదిస్తే సర్వర్ పనిచేయడం లేదని వెనక్కి పంపిస్తున్నారు. రాబోయే రోజుల్లో గ్యాస్ సిలిండర్ సమస్య మరింత ఉత్పన్నమవుతుందనే భయాందోళనతో చాలా మం ది ఏజెన్సీలను సంప్రదిస్తున్నారు.
ఈ పరిస్థితుల్లో గ్యాస్ సిలిండర్లను అందరికి సర్దుబాటు చేయడంతోనే సమయం సరిపోతున్నదని, కేవైసీ అప్డేట్ వంటి అంశాలను పట్టించుకోవడం లేదని ఓ ఏజెన్సీకి చెందిన సిబ్బంది తెలిపారు. ఏప్రిల్ 15 నుంచి కేవైసీ అప్డేట్ చేస్తామని వినియోగదారులను వెనక్కి పంపిస్తున్నారు. అన్ని రోజులు ఎందుకు అని నిలదీస్తే కేవైసీ అంశం అప్పుడే పరిశీలించాలని తమకు ఆదేశాలు ఉన్నట్టు చెబుతున్నారు. సిలిండర్ల కొరత దృష్ట్యా బేగంపేట, అబిడ్స్, తార్నాక, మెహిదీపట్నం, షేక్‌పేట, దిల్సుఖ్నగర్ తదితర ప్రాంతా ల్లో గ్యాస్ ఏజెన్సీల అలసత్వంపై వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సిబ్బందితో వాగ్వాదానికి దిగుతున్నారు. అధికారులు ఎప్పటికప్పుడు అన్నీ గ్యాస్ ఏజెన్సీలతో సంప్రదింపులు జరిపి వినియోగదారులకు సిలిండర్లు సకాలంలో అందించాలని ఆదేశాలిస్తున్నారు. అయితే క్షేత్రస్థాయిలో మాత్రం ఏజెన్సీలు పట్టించుకోవడంలేదనే ఆరోపణలున్నారు. ఏజెన్సీల నంబర్లు కూడా పనిచేయడం లేదని వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్యాస్ సిలిండర్ల విషయంలో ఏజెన్సీల నిర్లక్ష్యాన్ని వినియోగదారులు సంబంధిత ఏఎస్‌ఓకు ఫిర్యాదు చేయొచ్చని అధికారులు సూచించారు.