మన్సూరాబాద్, జూన్ 25: మలిదశ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తన వంతు కృషి చేసిన ఉద్యమకారుడు కుకునూరు వెంకట్‌రెడ్డి అని ఎంఆర్డీసీ చైర్మన్, ఎల్బీ నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి అన్నారు. ఎల్బీనగర్, ఆర్టీసీ కాలనీకి చెందిన కుకునూరు వెంకట్‌రెడ్డి అనారోగ్యంతో మృతి చెందాడు. విషయాన్ని తెలుసుకున్న ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి ఆదివారం ఉదయం ఆర్టీసీ కాలనీకి చేరుకుని వెంకట్‌రెడ్డి పార్థీవ దేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. ఆయన కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం, నిర్వహించిన వెంకట్‌రెడ్డి అంతిమయాత్రలో ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి పాల్గొని పాడె మోశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మలిదశ ఉద్యమకారుడు కుకునూరు వెంకట్‌రెడ్డి అకాల మరణం ఎంతో కలిచి వేసిందని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం జరిగిన మలి దశ ఉద్యమంలో ఆయన పాత్ర మరువలేనిదని తెలిపారు. కుకునూరు వెంకట్‌రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని కోరుకుంటున్నానని తెలిపారు. వెంకట్‌రెడ్డి మరణం కుటుంబానికి తీరని లోటు అని.. ఆయన కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకుంటామని తెలిపారు. కుకునూరు వెంకట్‌రెడ్డికి నివాళులర్పించిన వారిలో మాజీ కార్పొరేటర్ ముద్రబోయిన శ్రీనివాసరావు, కొత్తపేట డివిజన్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ వట్నాల విశ్వేశ్వర్ రావు, ఎల్బీనగర్ నియోజకవర్గం బీఆర్ఎస్ ఎస్సీసెల్ చైర్మన్ జోగు రాములు, కంచర్ల అశోక్‌రెడ్డి, ఏర్పుల గాలయ్య, బాలాజీ గైక్వాడ్, మహేష్ రెడ్డి, సల్వాచారి తదితరులు ఉన్నారు.