సిటీబ్యూరో, మే 9 (నమస్తే తెలంగాణ): ప్రారంభ దశలో ఉన్న స్టార్టప్‌లకు అన్ని విధాలుగా ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త కార్యక్రమాన్ని ఆవిష్కరించింది. తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్(టీఎస్ఐసీ) ఆధ్వర్యంలో టీ-ఇంక్యుబేటర్స్, యాక్సిలరేటర్స్ కన్సార్షియంలు కలిసి ఏర్పాటు చేసిన మిషన్ 10ఎక్స్- స్పెషల్ ఇంటరెస్ట్ గ్రూప్స్(ఎస్ఐజీ) పోస్టర్‌ను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఇతర అధికారులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తొలి దశల్లో ఉన్న స్టార్టప్‌ల ఎదుగుదలకు ఇది మంచి అవకాశమన్నారు. ఎంపిక చేసిన స్టార్టప్‌లకు కార్పొరేట్ మారెట్ రివ్యూస్, కస్టమర్ కనెక్టస్, ఫండింగ్ వంటి అంశాల్లో సహాయం లభిస్తుందని తెలిపారు.
ఈ కార్యక్రమం తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశంలోని ఇతర రాష్ట్రాల్లో ఉన్న వివిధ ఇంక్యూబేటర్స్, యాక్సిలరేటర్స్తో సహాయం పొందేలా పనిచేస్తుందన్నారు.మారెట్ లో ప్రవేశించేందుకు సిద్ధంగా ఉన్న లేక ప్రారంభ దశలో ఉండి ఎదుగుతున్న అగ్రిటెక్, మెడిటెక్, డీప్ టెక్ రంగాల్లోని స్టార్టప్‌లకు మిషన్ 10 ఎక్స్ -ఎస్ఐజిస్ ఉపయోగపడనుందన్నారు. అనంతరం టీఎస్ఐసీ చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్ డాక్టర్ శాంతా తౌటం మాట్లాడుతూ ఉత్తమ ఫలితాలే లక్ష్యంగా రాష్ట్ర ఆవిషరణ వ్యవస్థలో ఉన్న ప్రముఖ సంస్థలన్నీ కలిసి రూపొందించిన కార్యక్రమమే మిషన్ 10 ఎక్స్ -ఎస్ఐజిస్ అన్నారు. స్టార్టప్‌లకు కావాల్సిన సహకారం, ఇతర అవసరాలను దృష్టిలో ఉంచుకొనే ఈ కార్యక్రమాన్ని రూపొందించామన్నారు.
ఇందులో టి -హబ్, రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ సరిల్ అఫ్ హైదరాబాద్, ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూట్ అఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ – హైదరాబాద్, ఐకేపీ నాలెడ్జి పార్, అటల్ ఇంక్యుబేషన్ సెంటర్, సెంటర్ ఫర్ సెల్యూలర్ మొలిక్యూలర్ బయాలజీ , అగ్రీ హబ్‌లు భాగస్వాములుగా ఉంటాయని వివరించారు. టీఎస్ఐసీ ఆలిండియా రోబోటిక్స్ అసోసియేషన్‌తో ఒక ఒప్పందం కుదుర్చుకున్నామని, ఈ ఒప్పందం ద్వారా పాఠశాలల్లో రోబోటిక్స్ మీద అవగాహన పెంపొందించడంతో పాటు ప్రయోగశాలలు ఏర్పాటు చేయనున్నామని శాంతా తౌటం తెలిపారు. ఈ కార్యక్రమంలో టీ హబ్ చీప్ డెలివరీ ఆఫీసర్ ఆంథోనీ అనీశ్, తదితరులు పాల్గొన్నారు.