సిటీబ్యూరో, జనవరి 6 (నమస్తే తెలంగాణ): మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ భూములను కాంగ్రెస్ ప్రభుత్వం కాజేయాలని చూస్తే ఉద్యమిస్తామని విద్యార్థులు హెచ్చరిస్తున్నారు. యూనివర్సిటీలో వసతి గృహాలు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. వందలాది మంది నిరుపేద విద్యార్థులు యూనివర్సిటీలో వసతులు లేక అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులకు అత్యవసరమైన హాస్టళ్లను యూనివర్సిటీలోని 50 ఎకరాల్లో నిర్మించాలని భావిస్తున్నట్లు చెప్పారు. వసతి గృహాలతో పాటు పలు రకాల భవనాలు నిర్మించేందుకు ఆ స్థలాన్ని ఉపయోగించాలని కేంద్ర విద్యాశాఖకు ఇప్పటికే ప్రతిపాదనలు పంపించారని వెల్లడించారు.
కనిపించిన ఖాళీ స్థలాలన్నింటినీ రియల్ మాఫియాకు కట్టబెట్టే కాంగ్రెస్ ప్రభుత్వం..ఇప్పుడు తమ యూనివర్సిటీపై కన్నేసిందని ఆరోపించారు. ‘యూనివర్సిటీ మాది… ఇక్కడి భూములన్నీ మావి.. మా భూములను కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తే పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం’ అని హెచ్చరించారు. గతంలోనూ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములను కాజేసేందుకు ప్రయత్నిస్తే విద్యార్థులు పెద్ద ఎత్తున ప్రభుత్వంపై తిరగబడ్డారని గుర్తు చేశారు. మనూ జోలికొస్తే అదే తరహాలో తామూ నిరసనలకు పిలుపునిస్తామని తేల్చి చెప్పారు. భూములను కొట్టేసే ప్రయత్నాలు మానేసి పాలనపై దృష్టిపెట్టాలని సూచిస్తున్నారు.
యూనివర్సిటీల్లో సీఎం రియల్ ఎస్టేట్ వ్యాపారం
తెలంగాణలోని యూనివర్సిటీలను సీఎం రేవంత్రెడ్డి రియల్ ఎస్టేట్ వెంచర్లుగా మారుస్తున్నారని విద్యావేత్తలు, మేధావులు మండిపడుతున్నారు. గతంలో కంచె గచ్చిబౌలి భూములను కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టే ప్రయత్నం చేశారని.. అది బెడిసికొట్టడంతో ఇప్పుడు మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీపై కన్నేశారని ఆరోపిస్తున్నారు. ఖాళీ స్థలం కనిపిస్తే అమ్ముకుందామనే ధోరణిలో ఫక్తు రియల్ ఎస్టేట్ వ్యాపారిలా ఆలోచిస్తున్నారని ఎద్దేవా చేస్తున్నారు.
ప్రజలకిచ్చిన హామీలను పక్కన పెట్టి భూములను అమ్మే రియల్ ఎస్టేట్ వ్యాపారిగా మారారని విమర్శిస్తున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారి సీఎం అయితే ఎలా ఉంటుందో చేసి చూపిస్తున్నారని అభిప్రాయపడుతున్నారు. తెలంగాణకు గుండెకాయ లాంటి హైదరాబాద్లోని భూములన్నీ కాజేసి రాష్ర్టాన్ని దివాళా తీసే కార్యక్రమానికి రేవంత్రెడ్డి కంకణం కట్టుకున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా భూముల అమ్మకాలపై ఉన్న తన దృష్టిని మార్చుకొని పాలనపై పెట్టాలని సూచిస్తున్నారు.
50 ఎకరాల భూమిపై కాంగ్రెస్ సర్కారు కన్ను

మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీకి చెందిన 50 ఎకరాల భూమిని లాకోవడానికి తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలపై బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని నిలదీస్తూ మంగళవారం ట్వీట్ చేశారు. ‘తెలంగాణలో మీ ప్రభుత్వం ఏం చేస్తోందో మీకు కనీసం అవగాహన ఉందా’..అని ప్రశ్నించారు. ‘విద్య, మైనార్టీల పక్షాన నిలబడతామని చెప్పే మీ పార్టీ విధానం ఇదేనా’ అంటూ ఆయన నిప్పులు చెరిగారు. ‘హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పచ్చని అడవిని బుల్డోజర్లతో కూల్చివేసి, వన్యప్రాణులను పొట్టన బెట్టుకోవడం ద్వారా మీ ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీకి జాతీయస్థాయిలో తలవంపులు తెచ్చార’ని కేటీఆర్ గుర్తు చేశారు.
ఆ అవమానకర ఘటన నుంచి పాఠాలు నేర్చుకోకుండా, ఇప్పుడు ఉర్దూ యూనివర్సిటీని లక్ష్యంగా చేసుకోవడం దారుణమన్నారు. ముఖ్యమంత్రికి ఉన్న రియల్ ఎస్టేట్ దురాశను తీర్చడం కోసం విద్యాసంస్థల భూములను కబళించడం అత్యంత హేయమైన చర్య అని కేటీఆర్ విమర్శించారు. విద్యాసంస్థలను బలోపేతం చేయాల్సిన ప్రభుత్వం, వాటిని నాశనం చేసేలా వ్యవహరించడం సమర్థనీయం కాదని హితవు పలికారు. విద్య అనేది కేవలం ఒక రాజకీయం కాదని, అది దేశ భవిష్యత్ అని ఆయన స్పష్టం చేశారు. ఉర్దూ యూనివర్సిటీ విద్యార్థులకు అండగా నిలుస్తామని ప్రకటించారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనకి తీసుకోకపోతే క్షేత్రస్థాయిలో ప్రజల మధ్య, న్యాయస్థానాల్లోనూ రాజీలేని పోరాటం చేస్తామని హెచ్చరించారు. విద్యార్థుల ప్రయోజనాలను కాపాడటమే తమ లక్ష్యమని పునరుద్ఘాటించారు.