సిటీబ్యూరో, జూలై 24 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుట్టిన రోజు వేడుకలను గురువారం గ్రేటర్ వ్యాప్తంగా బీఆర్ఎస్ నేతలు, అభిమానులు పెద్ద పెద్ద ఎత్తున నిర్వహించారు. పలు చోట్ల భారీ కేక్ కటింగ్‌లు, రక్తదానం, అన్నదానం, చీరల పంపిణీ, రోగులకు పండ్ల పంపిణీ, ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమం పేరుతో సామాజిక కార్యక్రమాలు చేపట్టి తమ అభిమానాన్ని చాటుకున్నారు.
టీఎస్టీఎస్ మాజీ చైర్మన్ పాటిమీది జగన్మోహన్ రావు ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయిలో రెండో ర్యాంకు సాధించిన తితీక్షకు రెండు రోజుల క్రితం కేటీఆర్ చేతుల మీదుగా ల్యాప్‌టాప్‌ను అందజేయగా, పుట్టిన రోజు సందర్భంగా దివ్యాంగులకు 6 మూడు చక్రాల వాహనాలు, పేద విద్యార్థులకు ఆరు ల్యాప్‌టాప్‌లు అందజేసినట్లు తెలిపారు. రాష్ట్ర స్థాయిలో మూడో ర్యాంకు సాధించిన హబ్సిగూడకు చెందిన పేద విద్యార్థిని భువనేశ్వరికి బీఆర్ఎస్ మైనార్టీ నేత అబ్దుల్ కేటీఆర్ చేతుల మీదుగా ఆర్థిక సాయం అందజేశారు.
తెలంగాణ ఫుడ్స్ మాజీ చైర్మన్ మేడే రాజీవ్ సాగర్ ఆధ్వర్యంలో బోయిగూడలోని సెయింట్ ఫిలోమెనాస్ హైస్కూల్లో మాజీ రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్‌కుమార్, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొని 100 బెంచీలు 20 మంది విద్యార్థులకు 20 సైకిళ్లను అందజేశారు. సతీశ్ రావు ఆధ్వర్యంలో నయశ్రీ ఫౌండేషన్ (అనాథాశ్రమం)లోని పిల్లలతో కలిసి కేక్ కట్ చేశారు. కార్పొరేటర్ విజయ్‌కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ వంద మంది బాలింతలకు బేబీ కిట్స్ అందజేశారు.
కార్ఖానాలోని వయో వృద్ధాశ్రమం ఆర్కే ఫౌండేషన్‌లో మాజీ చైర్మన్ గజ్జెల నగేశ్ రూ. 5 లక్షల విలువైన వైద్య పరికరాలను అందజేశారు. బీఆర్ఎస్వీ రాష్ట్ర కార్యదర్శి ప్రశాంత్ ఆధ్వర్యంలో ఓయూ ఆర్ట్స్ కళాశాల ఆవరణలో నిర్వహించిన వేడుకల్లో రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌యాదవ్ పాల్గొన్నారు. కార్పొరేటర్ నర్సింహయాదవ్ మల్లికార్జునకాలనీలో తన గృహ సముదాయంలో కేక్ కట్ చేసి 1000 మంది నిరుపేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు.