కొండాపూర్ : ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్‌ను వినియోగించాలని, రోడ్డు ప్రమాదాల్లో చాలా మంది హెల్మెట్ లేకపోవడంతోనే ప్రాణాలను కోల్పోతున్నారని కొండాపూర్ 8వ పోలీసు బెటాలియన్ కమాండెంట్ పీ మురళీ కృష్ణ పేర్కొన్నారు. మంగళవారం బెటాలియన్ అధికారులు, సిబ్బందితో కలిసి ఆయన హెల్మెట్, సీట్ బెల్ట్‌ల ప్రాధాన్యతపై అవగాహన కల్పిస్తూ నిర్వహించిన బైక్ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు.
అనంతరం నిర్వహించిన సదస్సులో కమాండెంట్ మురళీకృష్ణ మాట్లాడుతూ ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్‌ను, కార్లలో ప్రయాణిస్తున్న వారు సీట్ బెల్ట్‌లను తప్పనిసరిగా ధరించాలని తెలిపారు. ప్రమాదాలభారీన పడుతున్న ద్విచక్ర వాహనదారుల్లో చాలా వరకు ప్రాణ నష్టం జరుగుతున్నది హెల్మెట్ ధరించకపోవడం వల్లే అన్నారు.
ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ వాహనాన్ని నడిపే వారితో పాటు వెనకాల కూర్చున్న వ్యక్తి సైతం తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని తెలిపారు. అనంతరం అధికారులు, సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో బెటాలియన్ అదనపు కమాండెంట్, అసిస్టెంట్ కమాండెంట్లు, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.