దుండిగల్,మే 20: దుండిగల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈనెల 7న జరిగిన ఈదులకంటి వెంకటేశ్ గౌడ్ హత్య కేసును పోలీసులు చేధించారు. హత్యకు పాల్పడిన ఇద్దరు నిందితులతో పాటు నేరస్తులను కాపాడేందుకు ప్రయత్నించిన నిందితుడి తండ్రిని, ఆధారాలు చెరిపేసిన మరో ఇద్దరు వ్యక్తులను పోలీసులు శనివారం అరెస్ట్‌చేసి రిమాండ్‌కు తరలించారు. వారి నుంచి ఒక అపాచీ ద్విచక్రవాహనం, రెండు కత్తులు, 5 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. మేడ్చల్ ఏసీపీ వెంకట్‌రెడ్డి దుండిగల్ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు.
దుండిగల్ మున్సిపాలిటీ పరిధి.. డీ.పోచంపల్లిలో నివాసముంటున్న మహ్మద్ బాబాఖాన్(58) స్థానికంగా కట్టెలమండి నిర్వహిస్తున్నాడు. ఇతని కొడుకు మహ్మద్ మాజిద్‌ఖాన్(24) 2021లో బాచుపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో దొంగతనానికి పాల్పడి జైలుకు వెళ్లొచ్చాడు. కీసర మండలం దమ్మాయిగూడకు చెందిన మహ్మద్ ఇబ్రహీం కొడుకు ముద్ధాసీర్ అహ్మద్(22), మాజిద్‌ఖాన్ స్నేహితులు. చీటికిమాటికి గొడవలకు దిగేవీరు కత్తులు కొనుగోలు చేశారు. ఈనెల 7న సాయంత్రం బహదూర్‌పల్లిలో కలుసుకొని అక్కడే ఉన్న ఓ వైన్‌షాపులో 6బీర్లు కొని కుడికుంట చెరువు వద్దకు వెళ్లారు. అదే సమయంలో దుండిగల్‌కు చెందిన ఈదులకంటి వెంకటేశ్‌గౌడ్(46) కారులో వచ్చి ఇద్దరిని ఇక్కడ మద్యం తాగొద్దని ప్రశ్నించగా ఇరువర్గాల మధ్య గొడవ జరిగింది. దీంతో ఆగ్రహానికి గురైన వారు కత్తులతో వెంకటేశ్ గౌడ్‌పై దాడి చేయగా అక్కడే మరణించాడు.
ఆధారాలు చెరిపేశారు..
అనంతరం అక్కడి నుంచి నిందితులు నేరుగా మాజిద్‌ఖాన్ తండ్రి మహ్మద్బాబాఖాన్ ఇంటికి వెళ్లి జరిగిన విషయం చెప్పారు. అతడి సహాయంతో దగ్గరి బంధువు మహ్మద్ అసదుల్లాఖాన్ అలియాస్ ఇమ్రాన్(25)వద్దకు పంపాడు. మరో బంధువు రిజ్వాన్(22)ను పిలిపించుకున్నారు. ఆ తర్వాత నిందితుల రక్తపు మరకలున్న బట్టలను అసదుల్లాఖాన్, రిజ్వాన్‌లు నాలాలో పడేశారు. అనంతరం ముద్దాసిర్ అహ్మద్ దమ్మాయిగూడకు వెళ్లగా, మహ్మద్బాబాఖాన్ తన కొడుకు మాజిద్ఖాన్ను హిందూపురంలోని జమాత్‌కు పంపించాడు.
నిందితులను పట్టించిన ఫోన్‌పే..
ఎటువంటి ఆధారాలు లేకుండా నిందితులు జాగ్రత్త పడటంతో పోలీసులు కేసును చాలెంజ్‌గా తీసుకున్నారు. హత్యజరిగిన రోజు అటుగా ఓ ద్విచక్రవాహనం పై ఇద్దరు వ్యక్తులు వచ్చినట్లు స్థానికులు తెలుపడంతో ఆ దిశగా దర్యాప్తును పోలీసులు మమ్మురం చేశారు. సీసీల ఆధారంగా జల్లెడ పట్టారు. నిందితులు ఇద్దరు బహదూర్‌పల్లి చౌరస్తాలోని వైన్‌షాపులో బీర్లు కొన్నట్లు గుర్తించారు. అదే సమయంలో బీర్లు కొనుగోలుకు ‘ఫోన్‌ఫే’ నుంచి డబ్బులు చెల్లించడం నిందితులను పట్టించింది. ఆ నంబర్ ఆధారంగా ముద్దాసిర్ ఆహ్మద్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా నిందితుడు నేరాన్ని అంగీకరించాడు. అతడు ఇచ్చిన సమాచారంతో పోలీసులు హిందూపురంలో ఉన్న మహ్మద్ మాజిద్ఖాన్ను అరెస్ట్‌చేశారు. నిందితుడిని దాచిపెట్టడం, ఆధారాలు దొరకకుండా చేసిన మహ్మద్ బాబాఖాన్, అసదుల్లాఖాన్, రిజ్వాన్ అలీని సైతం అరెస్ట్‌చేసి రిమాండ్‌కు తరిలించారు.