చార్మినార్, అక్టోబర్ 15 : వాయిదాల పద్ధతిలో కొనుగోలు చేసిన వస్తువుల నెలవారీ ఈఎంఐ చెల్లించకపోవడంతో ఓ వ్యక్తిని కిడ్నాప్ చేసేందుకు యత్నించిన నిందితులను ఫలక్‌నుమా పోలీసులు పట్టుకున్నారు. ఫలక్‌నుమా ఏసీపీ జావెద్ తెలిపిన వివరాల ప్రకారం.. రెయిన్‌బజార్ ప్రాంతానికి చెందిన మహ్మద్ హమీద్ (24) వ్యాపారి. అతడి వద్ద ఫలక్‌నుమా పరిధిలోని బీబీకా ఛష్మ ప్రాంతానికి చెందిన జుబేర్ రెండు నెలల కిందట వాషింగ్ మెషిన్‌తో పాటు రిఫ్రిజిరేటర్‌ను రూ. 30 వేలకు వాయిదాల పద్ధతిలో కొనుగోలు చేశాడు. ఇందుకు జమానత్‌గా అదే ప్రాంతానికి మహ్మద్ అలీ ఉన్నాడు. ఇటీవల జుబేర్ గుల్బర్గా వెళ్లి తిరిగి రాలేదు. దీంతో కొనుగోలు చేసిన వస్తువుల నెలవారీ వాయిదాలు కూడా చెల్లించలేదు. ఈ విషయాన్ని వ్యాపారి హమీద్ తన స్నేహితులతో చెప్పడంతో.. జమానత్‌గా ఉన్న అలీని ప్రశ్నిస్తే.. జుబేర్ వివరాలు తెలుస్తాయని సలహా ఇచ్చారు. అలీని అడుగగా.. జుబేర్ గుల్బర్గాలో ఉన్నట్టు చెప్పాడు.
దీంతో ఈనెల 13న హమీద్, అతడి స్నేహితులు మహ్మద్ సిరాజ్ ఖాన్ (42), అంజాద్ ఖాన్ (38), సయ్యద్ ఖాజా షరీఫుద్దీన్ (24), మహ్మద్ రహీం పాషా (37), మహ్మద్ షేక్ ఆసిఫ్ (25) కలిసి బలవంతంగా అలీని కారులో ఎక్కించుకొని గుల్బర్గా బయలుదేరారు. 13వ తేదీ అర్ధరాత్రి దాటినా కూడా అలీ ఇంటికి వెళ్లకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఫోన్ కాల్స్, సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేపట్టి గుల్బర్గా వెళ్తున్నట్టు గుర్తించారు. వెంటనే అప్రమత్తమైన ఫలక్‌నుమా ఇన్స్పెక్టర్ ఆదిరెడ్డి గుల్బర్గా సుల్తాన్‌పుర్ పోలీసులను అలర్ట్ చేశారు. అక్కడి పోలీసులు రోడ్డుపై విస్తృతంగా వాహనాలు తనిఖీ చేశారు. నిందితులు వెళ్తున్న క్వాలిస్ వాహనాన్ని గుర్తించిన సుల్తాన్‌పుర్ పోలీసులు.. నిందితులందరినీ అదుపులోకి తీసుకున్నారు. ఫలక్‌నుమా పోలీసులు మంగళవారం నిందితులను అదుపులోకి తీసుకున్నట్టు ఏసీపీ జావెద్ తెలిపారు. నిందితులను అరెస్ట్ చేసి, రిమాండ్‌కు తరలిస్తున్నట్టు ఏసీపీ తెలిపారు.