నగరంలో అతివలకు రక్షణ కరువవుతున్నది. మహిళలపై అఘాయిత్యాలను నిలువరించడంలో పోలీసులు విఫలమవుతున్నారు. రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఈ సారి 4 శాతం నేరాలు పెరిగాయి. ఇందులో పోక్సో కేసుల సంఖ్య పెరగడం ఆందోళన కలిగిస్తున్నది. సమాజంలో మానవ విలువలు దెబ్బతింటున్నాయని పోలీసులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. లైంగికదాడి కేసుల్లో నిందితులు ఎక్కువగా తెలిసిన వారే ఉంటున్నారు. మహిళలపై జరిగే దాడులు, ఈవ్‌టీజింగ్, ఇతరత్రా సమస్యలను పరిష్కరించడం కోసం షీ టీమ్స్ ఉన్నా ఆశించిన ఫలితాలు రాబట్టడం లేదనే విమర్శలు వస్తున్నాయి.
-సిటీబ్యూరో, డిసెంబర్ 25 (నమస్తే తెలంగాణ)
సిటీబ్యూరో, డిసెంబర్ 25 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత మహిళలపై అఘాయిత్యాలు పెరుగుతున్నాయని సామాన్య ప్రజలు భయాందోళనలు గురవుతున్నారు. మహిళలకు సేఫ్‌జోన్‌గా ఉన్న హైదరాబాద్‌లో సరైన నిఘా వ్యవస్థ, పెట్రోలింగ్ లేకపోవడంతో మహిళల భద్రత కరువుతుందంటూ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరకట్నం హత్యలు, వరకట్నం మరణాలు, గృహ హింసల, మహిళల హత్య కేసులు తగ్గినా, అఘాయిత్యాలు మాత్రం పెరగడంపై ఆందోళన వ్యక్తమవుతున్నది.
ఇదిలా ఉంటే షీ టీమ్స్‌కు బాధితులు ధైర్యంగా వచ్చి ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచిస్తున్నా, కొన్ని సార్లు బాధితులు బయటకు రావడానికి జంకుతున్నారు. అయితే షీ టీమ్స్ వచ్చిన ఫిర్యాదుల్లో గతేడాది కంటే ఈసారి తక్కువగా కేసులు నమోదయ్యాయి. గతేడాది 208 కేసులు నమోదవ్వగా, ఈ ఏడాది 156 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. 10760 డెకాయి ఆపరేషన్లు నిర్వహించారు. అందులో మెట్రో స్టేషన్లు, ట్రైన్లలో 735 డెకాయి ఆపరేషన్లు నిర్వహించినట్లు ఇటీవల రాచకొండ పోలీసులు విడుదల చేసిన వార్షిక నివేదికలో వెల్లడించారు.
పోలీస్స్టేషన్లకు వచ్చే మహిళలకు సంబంధించిన కేసుల్లో కిడ్నాప్, లైంగిక వేధింపులు, పోక్సో కేసులలో నిందితులు ఎక్కువగా తెలిసిన వారే ఉంటున్నారు. ఇందులో పోక్సో కేసులు ఎక్కువగా నమోదయ్యాయి. అయితే పిల్లలకు సురక్షితమైన వాతావారణం కల్పించడంతో పాటు వారి బాగోగులపై తల్లిదండ్రులు తగిన పర్యవేక్షణ ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. తెలిసిన వారే కదా అనే ఈజీగా తీసుకుంటే, వాళ్లే పిల్లలపై అఘాయిత్యాలు చేసే ప్రమాదాలు ఉంటున్నాయని పోలీసులు చెబుతున్నారు.
సమాజంలో మానవ విలువలు తగ్గుతున్నాయని, వయస్సుతో సంబంధం లేకుండా పిల్లలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారని పోలీసు అధికారులు ఆవేదన వ్యక్తం చేశారు. అయితే కేసుల దర్యాప్తులో నిందితులు ఎక్కువగా బాధితులకు తెలిసిన వారే ఉంటున్నారన్నారు. తల్లిదండ్రులు బాధ్యతగా తమ పిల్లలను ఒక కంట కనిపెడుతూ వారికి సురక్షితమైన వాతావారణం కల్పించాలని సూచిస్తున్నారు. రాచకొండలో 326 లైంగిక దాడి కేసులు నమోదైతే అందులోని నిందితులు, బాధితులకు స్నేహితులైన వారు 184, కుటుంబానికి సంబంధించిన వాళ్లు 37, ఇరుగు పొరుగు వారు 35, ఇతరులు 70 మంది ఉన్నారని నివేదికలో వెల్లడించారు.
నేరం 2024 2025
లైంగిక వేధింపులు 561 809
పోక్సో కేసులు 392 516
కిడ్నాప్‌లు 233 479