Khairatabad Ganesh | సిటీబ్యూరో, సెప్టెంబరు 28 (నమస్తే తెలంగాణ) : పదకొండు రోజుల పాటు ఆ బాల గోపాలంతో పూజలందుకొని భాగ్యనగరంలో ఆధ్యాత్మిక ఉత్సాహాన్ని నింపిన గణపయ్యలు గురువారం వీడ్కోలు తీసుకున్నారు. భక్తిశ్రద్ధలతో నగరవాసులు ధూప దీప నైవేద్యాలను సమర్పించి లంబోదరులను నిమజ్జనం చేశారు. నగరవ్యాప్తంగా ప్రతిష్టితమైన దాదాపు 90వేల గణపతుల నిమజ్జనం శుక్రవారం ఉదయం వరకు జరగనుంది. 63 అడుగుల ఎైత్తెన ఖైరతాబాద్ మహాగణపతి మధ్యాహ్నం ఒంటిగంట 27 నిమిషాలకు గంగమ్మ ఒడికి చేరుకున్నాడు.

బాలాపూర్ నుంచి ప్రారంభమై చార్మినార్, ఆబిడ్స్, బషీర్‌బాగ్ మీదుగా ట్యాంక్‌బండ్ చేరిన శోభాయత్ర ఉత్సవ విగ్రహాలు, భక్తులతో పోటెత్తింది. ‘కత్తులు బల్లెము చేతబట్టి.. దుష్టుల తలలు మూటగట్టి.. నువ్వు పెద్దపులి నెక్కిరావమ్మో… గండిపేట ఓ మైసమ్మ… ఓ మైసమ్మో’ అంటూ ఊపున్న పాటలకు ఊగిపోతూ నగర యువకులు సందడి చేశారు. తీన్మార్ డప్పుల మోతకు చిన్నా పెద్ద, మహిళలు లయబద్ధంగా స్టెప్పులు వేశారు.

నిమజ్జనం వైభవంగా జరిగేలా అటు జీహెచ్ఎంసీ, ఇతర విభాగాలు ఇటు మూడు కమిషనరేట్ల పోలీసులు అన్ని ఏర్పాట్లు చేయడంతో అవాంఛనీయ ఘటనలేవీ జరగలేదు.కాగా ఈ సారి గణపతి లడ్డూలకు అనూహ్యమైన పోటీ పెరిగింది. బండ్లగూడ జాగీర్ పరిధిలోని సన్‌సిటీ రిచ్మండ్ విల్లాస్ గేటెడ్ కమ్యూనిటీలో నిర్వహించిన లడ్డు ఏకంగా కోటి 26 లక్షలు, ప్రతిష్టాత్మక బాలాపూర్ లడ్డు 27 లక్షలు పలికాయి.

గణనాయకాయ.. గణదైవతాయ.. ఏకదంతాయ..
వక్రతుండాయ.. జై బోలో గణేశ్ మహరాజ్‌కీ జై..
గణపతి బప్పా మోరియా.. అంటూ.. గణనాథుడి నామస్మరణ నగరంతా ప్రతిధ్వనించింది. గల్లీ గల్లీ నుంచి బయలుదేరిన వినాయక విగ్రహాల శోభాయాత్రలతో గురువారం భాగ్యనగరంలో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది. ఎక్కడ చూసినా డప్పుల దరువు, డీజేల హోరుతో కోలాహలం ఏర్పడింది. నవరాత్రులు ఘనంగా పూజలందుకున్న గణనాథులు.. భక్తుల నీరాజనాల మధ్య గంగ ఒడికి చేరారు.




