బంజారాహిల్స్, సెప్టెంబర్ 8: కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిందంటూ రెండేళ్లుగా తప్పుడు ప్రచారం చేస్తున్న రేవంత్‌రెడ్డి వెంటనే తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఖైరతాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్చార్జి మన్నె గోవర్ధన్‌రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం బంజారాహిల్స్‌లోని బీఆర్ఎస్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన సీఎం రేవంత్‌రెడ్డి అనేకమార్లు కాళేశ్వరం ప్రాజెక్టు కుప్పకూలిందని, రూ.లక్ష కోట్లు వృథా అయ్యిందంటూ తప్పుడు ప్రచారాలు చేసారన్నారు.
అయితే గోదావరి ఫేజ్-2 పేరుతో సోమవారం గండిపేటలో సీఎం రేవంత్‌రెడ్డి చేపట్టిన ప్రాజెక్టుకు 20 టీఎంసీల నీరు వచ్చేది కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మల్లన్న సాగర్ నుంచే అని గోవర్ధన్‌రెడ్డి స్పష్టం చేశారు. మల్లన్నసాగర్ నుంచి నీళ్లు తీసుకువస్తున్నామంటూ పత్రికల్లో ప్రకటనలు ఇస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రానున్న ఎన్నికల్లో రేవంత్‌రెడ్డికి ప్రజలే తగిన బుద్ధి చెబుతారన్నారు.