సిటీబ్యూరో, ఏప్రిల్ 28 (నమస్తే తెలంగాణ): ‘ఇది చాలా అరుదైన రుగ్మత…ఇలాంటి వ్యాధిగ్రస్తులకు చికిత్స చేయడం చాలా కష్టం.. ఈ సర్జరీ మేము చేయలేం..ఈ సర్జరీకి విదేశాల నుంచి వైద్యులను పిలిపించాల్సి ఉంటుంది… డబ్బు చాలా ఖర్చవుతుంది.. అయినా రోగి ప్రాణాలకు భరోసా ఇవ్వలేం..’ అంటూ పేరున్న కార్పొరేట్ దవాఖానలు చేతులెత్తేసిన ఎంతోమంది రోగులను అక్కున చేర్చుకుంటూ.. వారి ప్రాణాలకు భరోసా కల్పిస్తున్నారు ఉస్మానియా వైద్యులు.
అన్ని రకాల హంగూ, ఆర్భాటాలతో ఆకర్షించే కార్పొరేట్ దవాఖానల్లో సైతం సాధ్యంకాని అరుదైన, అత్యంత క్లిష్టమైన కాలేయ సంబంధిత వ్యాధులతో బాధపడే రోగులకు, ముఖ్యంగా చిన్నారులకు విజయవంతంగా శస్త్రచికిత్సలు జరుపుతూ ప్రపంచ స్థాయి రికార్డులు బ్రేక్ చేస్తున్నారు ఉస్మానియా వైద్యులు. నిత్యం వందలు, వేల సంఖ్యలో వచ్చే రోగుల తాకిడి ఉన్నప్పటికీ పని ఒత్తిడిని సైతం లెక్కచేయకుండా గంటల తరబడి సమయం వెచ్చించి, వైద్యులు, నర్సింగ్ అధికారులు, టెక్నీషియన్స్, పారామెడికల్ తదితర అన్ని రకాల బృందాలను సమన్వయం చేసుకుని ఒక టీమ్‌వర్క్‌తో ముందుకు వెళ్లడంతోనే ఇలాంటి క్లిష్టమైన శస్త్రచికిత్సలు చేయడం సాధ్యమవుతుందని వైద్యులు చెబుతున్నారు.
అభయహస్తంగా కేసీఆర్ పథకాలు
అవయవ మార్పిడి శస్త్రచికిత్సల్లో గుండె మార్పిడి తరువాత అత్యంత ఖరీదైన వాటిల్లో కాలేయ మార్పిడి శస్త్రచికిత్సనే. కార్పొరేట్లో కాలేయ మార్పిడి శస్త్రచికిత్సకు రోగి ఆరోగ్య స్థితి ఆధారంగా సుమారు రూ.30లక్షల నుంచి రూ.40లక్షల వరకు ఖర్చవుతుంది. దీనికి తోడు కాలేయ సంబంధిత వ్యాధులకు అవసరమైన శస్త్రచికిత్సలు సైతం ఖరీదైనవే. పైగా కాలేయ మార్పిడి తదితర శస్త్రచికిత్సలు చేయించుకున్న రోగులు జీవితాంతం కొన్ని రకాల మందులను వాడాల్సి ఉంటుంది.
ఈ మందులు కూడా చాలా ఖరీదైనవి. ఇంత ఖర్చు భరించే ఆర్ధిక స్థోమత లేక చాలామంది రోగులు ఉన్న ఆస్తులను అమ్ముకుని రోడ్డు పాలవగా మరికొంతమంది ఆస్తులు కూడా లేని రోగులు చేసేది లేక ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి. దీనికి చలించిన నాటి కేసీఆర్ సర్కార్ ఖరీదైన వైద్యాన్నినిరుపేదలకు అందించాలనే ఉద్దేశంతో అవయవ మార్పిడి శస్త్రచికిత్సలతో పాటు ఖరీదైన చికిత్సలను సైతం ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకువచ్చారు. దీంతో ప్రతి ఏటా వేలాది మంది నిరుపేదలు అవయవ మార్పిడి శస్త్రచికిత్సలతో పాటు పలురకాల ఖరీదైన వైద్యాన్ని ఉచితంగా పొందుతున్నారు.
అరుదైన చికిత్సలతో ప్రపంచ రికార్డులు
అరుదైన శస్త్రచికిత్సలతో ఉస్మానియా సర్జికల్ గ్యాస్ట్రో, మెడికల్ గ్యాస్ట్రో వైద్యనిపుణులు ప్రపంచ రికార్డులకు కేరాఫ్ అడ్రస్‌గా మారారు. ఈ క్రమంలోనే 2018లో ఆటో లివర్ ట్రాన్స్‌ప్లాంట్‌ను విజయవంతంగా జరిపి ప్రపంచ రికార్డు సృష్టించారు. 6 వారాల వయస్సు గల చిన్నారికి కాలేయానికి రక్తం సరఫరా చేసే రక్తనాళాలు సరిగ్గా వృద్ధి చెందకపోవడంతో సదరు రోగి కాలేయాన్ని తొలగించి, కొంతసేపు బయట పెట్టి, రక్తనాళాలను పునరుద్ధరించిన తరువాత అదే కాలేయాన్ని తిరిగి అమర్చినట్లు ఉస్మానియా సర్జికల్ గ్యాస్ట్రో విభాగాధిపతి డాక్టర్ మధుసూదన్ తెలిపారు.
ఈ తరహా సర్జరీ ప్రపంచంలోనే తొలిసారిగా కెనడాలో చేయగా 2018లో రెండోసారి ఉస్మానియా వైద్యులు చేసి రికార్డు సృష్టించారు. ‘అలిగెలి సిండ్రోమ్‌తో పాటు గుండె సమస్య ఉన్న రెండేండ్ల వయస్సుగల చిన్నారికి సైతం ఉస్మానియా వైద్యులు లివర్ ట్రాన్స్‌ప్లాంట్ చేశారు. తాజాగా అరుదైన మార్ఫన్ రుగ్మతతో పాటు కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న 14 ఏళ్ల బాలుడికి కాలేయ మార్పిడి జరిపి మరోసారి ప్రపంచ రికార్డు సృష్టించారు. ఈ తరహా అరుదైన, అత్యంత క్లిష్టమైన శస్త్రచికిత్సలన్నీ ఆరోగ్యశ్రీ పథకం కిందనే పైసా ఖర్చులేకుండా నిర్వహించారు.
సమష్టి కృషితోనే శస్త్ర చికిత్సలు
ఉస్మానియా ఆసుపత్రిలో ఇటీవల 14ఏళ్ల బాలుడికి జరిపిన కాలేయ మార్పిడి శస్త్రచికిత్స ప్రపంచంలోనే మొట్టమొదటిది. 2015నుంచి ఉస్మానియాలో అత్యంత క్లిష్టమైన కేసులకు కూడా లివర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జరీస్ చేస్తున్నాం. ఇప్పటివరకు 42 లివర్ ట్రాన్స్‌ప్లాంట్స్ చేశాం. అంతేకాకుండా 5వేల మంది రోగులకు జీఐ కాంప్లెక్స్ సర్జరీలు, 300 లివర్ క్యాన్సర్ సర్జరీలను విజయవంతంగా జరిపాం. ఈ సర్జరీలన్నీ పైసా ఖర్చులేకుండా ఆరోగ్యశ్రీ పథకం కింద పూర్తి ఉచితంగానే నిర్వహించాం. ఉస్మానియా సూపరింటెండెంట్ డా.రాకేష్ సాహె, తోటి వైద్య బృందం, నర్సింగ్ సిబ్బంది, దవాఖానలోని ఇతర అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది సహకారంతోనే ఈ విజయాలు సాధించగలుగుతున్నాం.
– డా.మధుసూదన్, సర్జికల్ గ్యాస్ట్రో విభాగాధిపతి, ఉస్మానియా ఆసుపత్రి