బడంగ్‌పేట, జనవరి 14 : మిషన్ భగీరథ పథకం ద్వారా ప్రతి ఇంటికీ తాగునీరు అందించి మహిళల ఆత్మగౌరవం కాపాడిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మహేశ్వరం మండల కేంద్రంలో రంగారెడ్డి జిల్లా జడ్పీ చైర్ పర్సన్ డాక్టర్ తీగల అనితా హరినాథ్ రెడ్డితో కలిసి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ లబ్ధిదారులకు చెక్కలను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఎనిమిదేండ్లలో 2,020 మందికి రూ.21కోట్ల కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు పంపిణీ చేశామని తెలిపారు. మహేశ్వరం మండల కేంద్రంలో ఒక్కరోజు 84 మందికి కల్యాణలక్ష్మి చెక్కులను అందజేయడం జరిగిందన్నారు. దరఖాస్తులు చేసుకున్న ప్రతి ఒక్కరికీ లబ్ధి చేకూరిందన్నారు. కల్యాణలక్ష్మితో బాల్య వివాహాలు తగ్గాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రఘుమారెడ్డి, వైస్ ఎంపీపీ సునీతా అంధ్యానాయక్, తాసీల్దార్, ఎంపీడీవో, ఎంపీటీసీలు, సర్పంచులు, బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గోన్నారు.
క్రీడలతో స్నేహ సంబంధాలు మెరుగు పడుతాయి
క్రీడలతో స్నేహ సంబంధాలు మెరుగు పడుతాయని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మహేశ్వరం మండలం పెండ్యాల గ్రామంలో స్వామి వివేకానంద జయంతి సందర్భంగా 21వ రాష్ట్ర స్థాయి కబడ్డీ చాలెంజ్ ముగింపు కార్యక్రమంలో మంత్రి పాల్గొని విజేతలకు జడ్పీ చైర్ పర్సన్ తీగల అనితా రెడ్డితో కలిసి బహుమతలు అందజేశారు.
పాఠశాలల అభివృద్ధికి కృషి
మన ఊరు-మన బడికి రూ.9.13 కోట్లు మంజూరు
బడంగ్‌పేట, జనవరి 14 : ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చడానికి సీఎం కేసీఆర్ నిధుల వరద పారిస్తున్నారని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మన ఊరు-మన బడి కార్యక్రమంలో మొదటి, రెండు, మూడో దశలవరకు అన్ని పాఠాశాలకు నిధులు కేటాయించి ప్రైవేట్ పాఠశాలల దీటుగా అభివృద్ధి చేస్తున్నారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 26వేల పై చిలుకు పాఠశాల్లో మొదటి విడతలో 9,123 పాఠశాలలు అభివృద్ధి చేస్తున్నామన్నారు.
మహేశ్వరం నియోజకవర్గంలో ప్రత్యేకంగా మన ఊరు-మన బడిలో మొదటి విడతలో ఎంపిక కానీ పాఠశాలలో ప్రత్యేక పనులకు రూ.9 కోట్ల 13 లక్షలు భారీ నిధులు మంజూరైనట్లు మంత్రి తెలిపారు. వాటిలో 87 పాఠశాలల్లో పెయింటింగ్‌కు రూ.2,87,19,200, 83 పాఠశాలల్లో మైనర్ మరమ్మతులకు రూ.2,45,65,064,పాఠశాలలో టాయిలెట్లకు రూ.99,58,092, విద్యుత్ లైట్లకు రూ.1,27,28,000, నల్లా కనెక్షన్లకు ఒక పాఠశాలలో రూ.85వేలు, నాలుగు పాఠశాలలో అదనపు తరగతుల కోసం రూ. ఒక కోటి 53 లక్షలు 6వేలు నిధులు మంజూరు అయ్యాయన్నారు. పాఠశాలల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నట్లు తెలిపారు.