KBR Park | బంజారాహిల్స్, జూన్ 21: తెలంగాణ ఉద్యమకారులను పిట్టలను కాల్చినట్టు కాల్చి చంపించిన నరరూప రాక్షసుడు కాసు బ్రహ్మానందరెడ్డి పేరుతో ఉన్న కేబీఆర్ పార్కును ప్రొ.జయశంకర్ నేషనల్ పార్కుగా మార్చాలని ఎమ్మెల్సీ చింతపండు నవీన్‌కుమార్ అలియాస్ తీన్మార్ మల్లన్న డిమాండ్ చేశారు. శనివారం బంజారాహిల్స్‌లోని కేబీఆర్ పార్కు వద్దకు తెలంగాణ బీసీ సంఘాల నేతలతో కలిసి వచ్చిన చింతపండు నవీన్‌కుమార్ ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో కార్యకర్తలు కేబీఆర్ పార్కు వద్ద ప్రొ. జయశంకర్ నేషనల్ పార్కు అంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. జై తెలంగాణ.. జై బీసీ అంటూ నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ నవీన్‌కుమార్ మాట్లాదుతూ.. 1969లోని తెలంగాణ తొలిదశ ఉద్యమంలో సీఎంగా ఉన్న కాసు బ్రహ్మానందరెడ్డి ఆధ్వర్యంలో 369 మందిని పొట్టన పెట్టుకున్నారని, అలాంటి వ్యక్తి పేరు నగరం నడిబొడ్డున పార్కుకు పెట్టడంతో పాటు విగ్రహాన్ని ఏర్పాటు చేయడం యావత్ తెలంగాణ సమాజానికి సిగ్గుచేటు అన్నారు. బీసీ బిడ్డ అయిన ప్రొఫెసర్ జయశంకర్ పేరును కేబీఆర్ పార్కుకు పెడుతున్నామని, త్వరలోనే కాసు బ్రహ్మానందరెడ్డి విగ్రహాన్ని ఇక్కడినుంచి ప్రొక్లెయిన్లతో పెకిలించి పారవేస్తామని హెచ్చరించారు.
తెలుగుతల్లి ఫ్లైఓవర్‌ను బెల్లి లలిత ఫ్లైఓవర్‌గా మార్చాలని, ఎల్బీనగర్లోని మాధవరెడ్డి ఫ్లైఓవర్‌ను శ్రీకాంతచారి ఫ్లైఓవర్‌గా మార్చాలని డిమాండ్ చేశారు. ప్రొ. జయశంకర్ నేషనల్ పార్కుగా నామకరణం చేస్తూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగిస్తే కాసు బ్రహ్మానందరెడ్డి విగ్రహాన్ని కూల్చేస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ బీసీ పొలిటికల్ జేఏసీ కో అర్డినేషన్ కమిటీ చైర్మన్ నందగాని హరిశంకర్ గౌడ్, విశ్వకర్మ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వేములవాడ మదన్మోహన్ చారి, జేఏసీ నేతలు బందారపు నర్సయ్య, రాళ్లబండి విష్ణుచారి, నాగరాజు, బిక్షపతి, సోమాచారి, బయ్య వెంకటేశ్వర్లు యాదవ్ ,పంతం శ్రీనివాస్, రవికిరణ్ , సీతా యాదగిరి యాదవ్ తదితరులు పాల్గొన్నారు.