కవాడిగూడ, డిసెంబర్ 14: పుస్తకం మస్తకం అయితే.. గ్రంథంలో ఉన్న జ్ఞానాన్ని తెలుసుకుంటారని, మనసు మురికిని పోగొట్టాలంటే మనసును జ్ఞానంతో పరిశుద్ధం చేయాలని ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖ పూర్వ అధ్యక్షుడు కసిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. అలాంటి జ్ఞానాన్ని గ్రంథాలు ఇస్తాయని ఆయన పేర్కొన్నారు. దోమలగూడలోని గ్రంథాలయ శాఖ ఆధ్వర్యంలో ఏవీ కళాశాల ఆడిటోరియంలో శ్రీ వేమన ఆంధ్ర భాషా నిలయ శతాబ్ధి ఉత్సవాలు, జస్టిస్ కొండా మాధవరెడ్డి శత జయంతి ఉత్సవాలను గురువారం ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా కసిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ, డాక్టర్ సి.నారాయణ రెడ్డి బుక్ కల్చర్ తగ్గిపోయి, లుక్కు కల్చర్ పెరిగిందన్నారు. సురవరం ప్రతాప్ రెడ్డి హాస్టల్ గ్రంథాలయంలో ప్రభుత్వం నిషేధించిన ‘ద ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్’ అనే గ్రంథాన్ని ఉంచారని పేర్కొన్నారు. అక్షరాన్ని జ్ఞానంగా మలుచుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమానికి రాష్ట్ర గ్రంథాలయ మాజీ చైర్మన్ ఆయాచితం శ్రీధర్, తెలుగు విశ్వవిద్యాలయం ఆచార్యులు డాక్టర్ ఎం.రాంచందర్, గంథాలయ శాఖ ప్రభుత్వ సిటీ కాలేజీ సహాయ ఆచార్యులు డాక్టర్ చేకొని రవికుమార్, తెలుగు విశ్వవిద్యాలయం గ్రంథాలయ శాఖా ప్రతినిధులు డాక్టర్ రాంచందర్, ఏవీ కాలేజీ కరస్పాండెంట్ డాక్టర్ గౌతమి, ఓయూ గ్రంథాలయ శాఖ పూర్వ అధ్యక్షుడు ఆచార్య ఎన్.లక్ష్మణ్ రావు, ఏవీ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ సీహెచ్ రాజలింగం, పీజీ సెంటర్ సంచాలకులు డాక్టర్ ఎం.భగవంత్‌రెడ్డి, గ్రంథ పాలకులు ఎం.రవీందర్, పి.ప్రతిభ, ఆంధ్ర విద్యాలయ విద్యా సంస్థల ఉపాధ్యక్షుడు ఆచార్య కే. రామచంద్రా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.