Hyderabad | వెంగళరావునగర్, అక్టోబర్ 4: మాయ మాటలతో నమ్మించి.. బాలిక న్యూడ్ వీడియో ఫోన్‌కాల్‌ను రికార్డ్ చేసిన ఓ యువకుడు.. సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ ఘటన మధురానగర్ పీఎస్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. మధురానగర్ పరిధిలో నివాసముండే బాలిక (16) ఫోన్ నంబర్‌ను ఆమె స్నేహితురాలి ద్వారా లోకేశ్(18) తీసుకున్నాడు.
ఆ బాలికకు ఫోన్‌చేసి పరిచయం పెంచుకున్నాడు. బాలికను భయపెట్టి ఆమెకు న్యూడ్ వీడియో కాల్ చేసి, రికార్డ్ చేశాడు. కొద్ది రోజుల కిందట అతడి దుష్ప్రవర్తనకు విసుగు చెందిన బాలిక.. ఫోన్ నంబర్‌ను మార్చేసింది. దీంతో ఆమెపై కక్ష గట్టాడు.
యువకుడి వేధింపులు పెరగడంతో తనకు ఇక చావే శరణ్యమనుకుంది. హుస్సేన్‌సాగర్‌లో దూకి ఆత్మహత్య చేసుకునేందుకు యత్నిస్తూ.. తన సోదరుడికి ఫోన్‌చేసి తాను చనిపోతున్నానని చెప్పింది. సోదరుడు ఇచ్చిన ఓదార్పుతో ఆత్మహత్యాయత్నాన్ని విరమించుకుంది. ఈ ఘటనపై బాలిక మధురానగర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.