సిటీబ్యూరో, జూలై 9 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలో కల్తీ కల్లు మాఫియా రాజ్యమేలుతోంది. ధనార్జనే ద్యేయంగా ప్రమాదకరమైన క్లోరోహైడ్రేడ్(సీహెచ్), ఆల్ఫాజోలం, డైజోఫామ్ వంటి మత్తు పదార్థాలతో ఈ మాఫియాలు కల్తీ కల్లు విక్రయిస్తూ ప్రజల ప్రాణాలను తోడేస్తున్నాయి. మామూళ్ళకు అలవాటు పడిన కొందరు ఆబ్కారీ అధికారులు ఈ మాఫియాలతో అంటకాగుతూ మొక్కుబడి దాడులతో ప్రజల ప్రాణాలు తీయడంలో పరోక్ష పాత్ర పోషిస్తున్నారంటూ జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రేటర్ పరిధిలోని పలు కల్లు కంపౌండ్లలో విచ్చల విడిగా నిషేధిత మత్తు పదార్థాలు కలుపుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడం వల్లనే బాలానగర్ కల్తీ కల్లు ఘటనలో ఆరుమంది మృత్యువాత పడినట్లు బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
గ్రేటర్‌లోని పలు కల్తీ కల్లు కంపౌండ్ల వెనక కొందరు నేతల ‘హస్తం’ ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే గాంధీలో చికిత్స పొందుతూ మృతిచెందిన కల్తీ కల్లు బాధితుల వివరాలు అధికారికంగా బయటకు రావడం లేదని మృతుల కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కూకట్పల్లి, బాలానగర్ పరిసర ప్రాంతాల్లో గత కొంత కాలంగా ఒక హస్తం నేతకు చెందిన కల్లు కంపౌండ్లలో జోరుగా కల్తీ కల్లు విక్రయాలు జరుగుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. 2004, 2014లో కూడా కల్తీ కల్లు ఘటనలు చోటుచేసుకున్నా అధికారుల తీరులో మార్పు రాకపోవడం గమనార్హం.
హైదరాబాద్ రెవెన్యూ డివిజన్ పరిధిలో కొందరు అధికారపార్టి నాయకుల కన్నుసన్నల్లో ఏడాదిన్నర కాలంగా అక్రమ కల్లు దుకాణాలు కొనసాగుతున్నాయి. ప్రజల ప్రాణాలకు హాని కలిగించే ప్రమాదకరమైన ఆల్ఫాజోలం, సీహెచ్ వంటి మత్తు పదార్దాలతో కల్తీ కల్లు తయారు చేసి విక్రయిస్తూ పట్టుబడిన ఈ కల్లు కంపౌండ్లను 2023లోనే సస్పెండ్ చేశారు.
కాని కొందరు అధికారులు, నాయకుల అండదండలతో ఆయా కల్లు సొసైటీల నిర్వాహకులు చట్టవిరుద్ధంగా కల్లు దుకాణాలను కొనసాగిస్తున్నారు. ప్రజల ప్రాణాలకు ముప్పు తలపెట్టే కల్లు దుకాణాలను పై అధికారులు సస్పెండ్ చేయడం, వారికి తెలియకుండా కింది స్థాయి అధికారులు యధేచ్చగా నిర్వహంచడం ఆబ్కారీ శాఖలో పరిపాటిగా మారింది. సస్పెన్షన్‌కు గురైన కల్లు దుకాణాలు ఆబ్కారీ రికార్డులో మాత్రం మూతబడి ఉన్నట్లు చూపిస్తారు. కాని వాస్తవ పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి.
హైదరాబాద్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని కల్లు దుకాణాల్లో కల్తీ కల్లు సేవించి పలువురు అస్వస్థతకు గురవడంతో 2023 నవంబర్‌లో అప్పటి నగర పోలీసు కమిషనర్ సందీప్ శాండిల్యా హైదరాబాద్, సికింద్రాబాద్‌లోని అన్ని కల్లు కంపౌండ్లపై దాడులు జరిపించారు. ఈ దాడుల్లో హైదరాబాద్ ఎక్సైజ్ యూనిట్ పరిధిలోని 24కల్లు దుకాణాలు, సికింద్రాబాద్ యూనిట్ పరిధిలోని 27కల్లు దుకాణాల్లో జోరుగా ఆల్ఫాజోలం కలుపుతున్నట్లు నిర్ధారణ జరిగింది. దీంతో నాటి పోలీసు కమిషనర్ సూచన మేరకు దర్యాప్తు జరిపిన ఆబ్కారీ అధికారులు హైదరాబాద్ పరిధిలోని 24కల్లు దుకాణాలు, నాలుగు సొసైటీలు, సికింద్రాబాద్ పరిధిలోని 27కల్లు దుకాణాలు, 15కల్లు సొసైటీలపై కేసులు నమోదు చేయడమే కాకుండా వాటిని సస్పెండ్ చేశారు.
2023లో కల్తీకల్లు దొరకడంతో సస్పెన్షన్‌కు గురైన కల్లు దుకాణాలను తెరవాల్సిందిగా సొసైటీ నిర్వాహకులు కోర్టును ఆశ్రయించినా ఫలితం దక్కలేదు. దీంతో కొందరు ఆబ్కారీ అధికారులు, నాయకుల సహకారంతో యధేచ్చగా ఏడాదిన్నర కాలంగా కల్తీ కల్లుదుకాణాలను నిర్వహిస్తుండటం ఆబ్కారీ శాఖ అవినీతి మత్తుకు అద్దం పడుతోంది.
గత నెల 3న కాచిగూడ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని అడిక్‌మెట్, ముషీరాబాద్ పరిధిలోని చిక్కడపల్లి కల్లు దుకాణాలలో ప్రాణాంతకమైన సీహెచ్ మత్తు పదార్థాన్ని అధికారులు పట్టుకుని సీజ్ చేసిన విషయం తెలిసిందే. కాని నిర్వాహకుడికి అధికార పార్టీతో ఉన్న చనువు, కొందరు ఆబ్కారీ అధికారులతో ఉన్న సంబంధాలతో సీజ్ చేసిన దుకాణాలను మరుసటి రోజే తెరిచారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ ఘటన జరిగిన నెలరోజుల్లోనే తాజాగా బాలానగర్ ఘటన చోటుచేసుకుంది. కల్తీ కల్లు విషయంలో చూసీ చూడనట్లుగా నడుచుకోవాలని కొందరు పెద్దల నుంచి ఆదేశాలు ఉన్నట్లు కొందరు ఆబ్కారీ అధికారులు బాహాటంగానే చెప్పడం గమనార్హం. ఇకనైనా కల్తీ కల్లుపై ఆబ్కారీ అధికారులు కఠినంగా వ్యవహరించాలని ప్రజలు కోరుతున్నారు.
కల్తీ కల్లు ఘటనపై న్యాయవాది ఇమ్మనేని రామారావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు హెచ్ఆర్సీ కేసు నమోదు చేసింది. ఈ మేరకు జరిగిన ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు జరిపి నివేదిక సమర్పించాలని ఆబ్కారి కమిషనర్‌ను ఆదేశించింది. నగరంలో పెద్ద ఎత్తున కల్తీ కల్లు విక్రయాలు జరుగుతున్న సంబంధిత అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని కల్తీ కల్లు తాగి సామాన్యులు మరణించిన నిందితులపై చర్యలు లేవని ఆయన ఆరోపించారు. ఈ ఘటనలో మృతి చెందిన బాధిత కుటుంబాలకు తగిన నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.
బాలానగర్: కల్తీ కల్లు ఘటనలో బాలానగర్ ఎక్సైజ్ పోలీసులు 5 కల్లు దుకాణాలపై కేసు నమోదు చేసినట్లు మేడ్చల్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఫయాజుద్దీన్ తెలిపారు. ఆరుగురిని అదుపులోకి తీసుకున్నామన్నారు.