ఉస్మానియా యూనివర్సిటీ, ఆగస్టు 23: ప్రపంచంలోనే కాళేశ్వరం ప్రాజెక్టు అరుదైన ఘనత సాధించిందని, అతి పెద్ద ఎత్తిపోతల పథకంగా చరిత్ర సృష్టించిందని రాష్ట్ర జల వనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్ వి.ప్రకాశ్ కొనియాడారు. ఈ ప్రాజెక్టు నిర్మాణ ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని ప్రశంసించారు. ఉస్మానియా యూనివర్సిటీ హిస్టరీ విభాగం ఆధ్వర్యంలో “ఇరిగేషనల్ డెవలప్మెంట్ ఇన్ తెలంగాణ స్టేట్ – ఎ హిస్టారికల్ పర్స్పెక్టివ్” అనే అంశంపై ప్రత్యేక ప్రసంగ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. హిస్టరీ విభాగం హెడ్ ప్రొఫెసర్ అర్జున్‌రావు కుతాడి అధ్యక్షతన నిర్వహించిన ఈ వర్చువల్ కార్యక్రమంలో వి.ప్రకాశ్ మాట్లాడుతూ, తెలంగాణ ప్రాంతంలో నీటి పారుదల రంగ అభివృద్ధి గురించి వివరించారు.
క్రీ.పూ. 2030 నుంచి ఇప్పటి వరకు ఎవరెవరి పాలనలో ఏఏ చెరువులు నిర్మాణమయ్యాయో సవివరంగా పేర్కొన్నారు. శాతవాహనుల కాలంలో చక్రవర్తుల ప్రధాన కర్తవ్యాలలో చెరువుల తవ్వకం ఒకటిగా ఉందన్నారు. ఇక్షాకుల కాలంలో విజయపురి (నాగార్జున సాగర్), శ్రీశైలం, జగ్గయ్యపేటలలో చెరువుల నిర్మాణం జరిగిందన్నారు. కాకతీయుల కాలంలో చక్రవర్తి తప్పనిసరిగా పాటించాల్సిన సప్త సంతానాలలో ఆరవ భాగంలో చక్రవర్తి గుళ్లు నిర్మించడంతో పాటు చెరువులను తవ్వించాలని స్పష్టంగా నిర్దేశించారని, వారి పాలనా కాలంలోనే ఈ ప్రాంతంలో వందల సంఖ్యలో చెరువులు నిర్మితమయ్యాయన్నారు. కుతుబ్ షాహీల పాలనలో దాదాపు పదిహేడు చెరువులు, మూడు కాలువలు, మూడు డ్యాంలు, మూడు బావులు తవ్వించారన్నారు.
అసఫ్‌జాహీల పరిపాలనా కాలంలో మోక్షగుండం విశ్వేశ్వరయ్య పర్యవేక్షణలో ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్లను తవ్వించారని చెప్పారు. స్వాతంత్య్రానంతరం కాంగ్రెస్ హయాంలో తొలిగా నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిర్మించారన్నారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు అనంతరం, అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ హయాంలో సాగునీటి రంగానికి అమితమైన ప్రాముఖ్యత కల్పించారని ప్రశంసించారు. మిషన్ కాకతీయ పేరుతో చెరువులను మూడు రకాలుగా (సూక్ష్మ, మధ్యస్థ, భారీ) విభజించి, అందుకనుగుణంగా నిధులు కేటాయించి, వాటికి మరమ్మతులు చేశారన్నారు. దీని ఫలితంగా తెలంగాణలో 2.5 మీటర్ల మేరకు భూగర్భ జల మట్టం పెరిగిందన్నారు. కార్యక్రమంలో ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ సి.గణేశ్ స్వాగతోపన్యాసం చేశారు.