గోల్నాక, మే 4: నత్తనడకన సాగిన అంబర్‌పేట ఫ్లై ఓవర్ నిర్మాణ పనులతో 8 ఏండ్లుగా స్థానికులు తీవ్రంగా ఇబ్బందులకు గురయ్యారని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. ఫ్లైఓవర్‌తో అంబర్‌పేట వాసులకు ఎలాంటి ప్రయోజనం లేదని, పక్కా ప్రణాళిక లేకుండా వంతెన నిర్మించడంతో వేలాది మంది విద్యార్థులు, స్థానిక ప్రజలు నరకం అనుభవిస్తున్నారని చెప్పారు. కనీసం సర్వీసు రోడ్లు వేయకుండానే ఫ్లై ఓవర్‌ను అధికారికంగా ఎలా ప్రారంభిస్తారని ప్రశ్నించారు.
సర్వీసు రోడ్లు వేశాక కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కాకపోతే ప్రధాని మోదీతో ఫ్లైఓవర్‌ను ప్రారంభించుకున్నా తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. ఇప్పటికే అంబర్‌పేట ఫ్లై ఓవర్‌పై రాకపోకలు సాగుతుండగా సోమవారం కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, కిషన్‌రెడ్డి తదితరులు అధికారికంగా ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం గోల్నాక క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ మాట్లాడారు.
అంబర్ పేట ఫ్లై ఓవర్ నిర్మాణానికి మొత్తం రూ.415 కోట్ల ఖర్చు కాగా అందులో భూ నిర్వాసితుల కోసం జీహెచ్ఎంసీ నిధులు రూ.192 కోట్లు ఉండగా దాదాపు రూ.323 కోట్ల నిధులు నేషనల్ హైవే అథారిటీ వెచ్చించిందని ఎమ్మెల్యే అన్నారు. 2018లో ప్రస్తుతం ఉన్న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఫ్లై ఓవర్ పనులు ప్రారంభించినా భూసేకరణలో జాప్యం, కొన్ని మతపరమైన నిర్మాణాలు అడ్డంకి తదితర సమస్యలను పరిష్కరించడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన ఆరోపించారు.
దీంతో ఫ్లై ఓవర్ నిర్మాణం పనులు దాదాపు ఎనిమిదేండ్ల పాటు నత్తనడకన కొనసాగిందన్నారు. ఫ్లె ఓవర్ అందుబాటులోకి వచ్చినా సర్వీసు రోడ్లు బాగు చేయకుండానే అధికారింగా ప్రారంభించడానికి ఏర్పాట్లు చేస్తున్నారన్నారు. కేంద్ర మంత్రికి కిషన్ రెడ్డికి ఇన్ని సమస్యలు ఉన్నా తెలియదా అని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ ప్రశ్నించారు.