నాంపల్లి క్రిమినల్ కోర్టులు, మే 24 (నమస్తే తెలంగాణ) : లంచం డిమాండ్ చేసి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డ ఏపీపీ,కోర్టు కానిస్టేబుల్‌కు 14రోజుల జ్యుడీషియల్ కస్టడీకి తరలిస్తూ ఏసీబీ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా పనిచేస్తున్న గోగులోత్ అశోక్ శివరామ్ నాయక్‌తోపాటు కానిస్టేబుల్ నిమ్మ సంజయ్‌ను శనివారం నాంపల్లిలోని ఏసీబీ కోర్టు ఎదుట హాజరుపర్చారు. వివరాల్లోకి వెళితే.. కామారెడ్డి జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టులో ఏపీపీగా అశోక్ శివరామ్, కామారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్ తరఫున కోర్టు కానిస్టేబుల్‌గా సంజయ్ విధులు నిర్వర్తిస్తున్నారు.
కాగా సీసీనెం.172 ఆఫ్ 2019 సెక్షన్ 420 కింద కామారెడ్డి టౌన్ పోలీసులు ఆందోళ్ల బంగారిపై కేసు నమోదు చేసి చార్జీషీట్‌ను కోర్టుకు సమర్పించారు. 2019నుంచి ఈ కేసు కోర్టులో పెండింగ్‌లో ఉన్నదని, సదరు కేసును త్వరితగతిన విచారణ పూర్తి చేసి కేసును కొట్టివేసేందుకు ఏపీపీ, కానిస్టేబుల్ రూ.15వేలు డిమాండ్ చేసి రూ.10వేలకు కుదించినట్టు తెలిపారు. మ్యాగ్మా ఇన్సూరెన్స్ కంపెనీలో ఏజెంట్‌గా పనిచేస్తున్న సమయంలో తనపై 2018లో ఫోర్జరీ చేసినట్టు సెక్షన్ 420 కింద కామారెడ్డి టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారని బంగారి ఫిర్యాదులో పేర్కొన్నాడు.
మే 13న కామారెడ్డి కోర్టుకు హాజరయ్యేందుకు వెళ్లగాశిక్షపడకుండా ఉండాలంటే డబ్బులు ఇవ్వాలని ఏపీపీతోపాటు కోర్టు కానిస్టేబుల్ డిమాండ్ చేసినట్టు తెలిపాడు. 2019 నుంచి కేవలం ఒకేఒక్క సాక్షిని మాత్రమే కోర్టు విచారించిందని, భారత్ గ్యాస్ కంపెనీలో కూలీ పని చేస్తూ జీవనం కొనసాగిస్తున్నానని వారిని వేడుకున్నానని పేర్కొన్నాడు. తన అంత డబ్బులు ఇవ్వలేనని ఏసీబీ అధికారులను ఆశ్రయించినట్టు బంగారి తెలిపాడు. నిజామాబాద్ ఏసీబీ డీఎస్పీ ఆదేశాల మేరకు ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, నిజామాబాద్ రేంజ్ ఏసీబీ అధికారులు నిందితులిద్దరిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని అరెస్టు చేశారు.