సిటీబ్యూరో, అక్టోబర్ (నమస్తే తెలంగాణ): జూబ్లీహీల్స్ ఉప ఎన్నికల నేపథ్యం లో బుధవారం ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేట్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు నగరంలో పలు చోట్ల తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో బోరబండ ఇందిరానగర్‌లో నిర్వహించిన తనిఖీల్లో అక్రమంగా సంచుల్లో మద్యం పెట్టుకుని విక్రయిస్తున్న ఇద్దరు మహిళలను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 173మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. తదుపరి విచారణ నిమిత్తం కేసును అమీర్‌పేట్ ఎక్సైజ్ స్టేష న్లో అప్పగించారు. ఈ తనిఖీల్లో సీఐ భిక్షారెడ్డి, ఎస్సై బాలరాజు పాల్గొన్నారు.
మరో కేసులో….
జూబ్లీహీల్స్ ప్రాంతానికి చెందిన సుమీత్ ట్రావెల్ ఏజెంట్. తరచూ పెద్ద సంఖ్యలో పర్యాటకులను విదేశాలకు పంపిస్తుంటాడు. ఈక్రమంలో తనకు దగ్గరి పరిచయం ఉన్న వారు వెళ్లినప్పుడు విదేశాల నుంచి మద్యం తెప్పించి నగరంలో విక్రయిస్తుంటాడు. పర్యాటకుల ద్వారా తెప్పించిన విదేశీ మద్యాన్ని తన వద్ద పనిచేసే మూర్తి, యుగేంధర్ల ద్వా రా మద్యం ప్రియులకు సరఫరా చేస్తాడు. ఈ క్రమంలో బుధవారం మూర్తి యుగేంధర్ ద్విచక్రవాహనంపై విదేశీ మద్యం తీసుకుని వెళ్తుండగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యం లో తనిఖీలు జరుపుతున్న హైదరాబాద్ ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు బోరబండా ప్రాంతం లో అతడిని పట్టుకున్నారు.
అతడి వద్ద నుం చి 9 విదేశీ మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. మనీష్‌కుమార్ నివాసంలో మరో 43విదేశీ మద్యం బాటిళ్లు లభించాయి. అయి తే ట్రావెల్ ఏజెంట్ సుమీత్ పర్యాటకుల ద్వారా ఎయిర్ పోర్ట్ నుంచి తెప్పించిన విదేశీ మద్యాన్ని తన కస్టమర్లకు విక్రయిస్తున్నట్లు విచారణలో వెల్లడించాడు. ఈ మేరకు మూర్తి యుగేంధర్, మనీష్కుమార్లను అరెస్టు చేయడంతో పాటు ట్రావెల్ ఏజెంట్ సుమీత్‌పై కేసు నమోదు చేశారు. నిందితుల వద్ద నుంచి రూ.6లక్షల విలువ చేసే 52 విదేశీ మద్యం బాటిళ్లు, కారు, ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. విదేశీ మద్యం పట్టుకున్న వారిలో ఎన్ఫోర్స్మెంట్ సీఐ చంద్రశేఖర్ గౌడ్ , ఎస్సై శ్రీనివాస్ , కానిస్టేబుళ్లు కరణ్ సింగ్ , శ్రీకాంత్ , సాయి కుమార్ , గోపాల్ , ప్రసాద్ తదితరులు పాల్గన్నారు.