బంజారాహిల్స్,అక్టోబర్ 11: మాజీ సీఎల్పీ నేత పీజేఆర్ నాన్ లోకల్ అంటూ వ్యాఖ్యలు చేసిన జూబ్లీహిల్స్ నియోజకవర్గ కాంగ్రెస్ నేత నవీన్ యాదవ్ మాటమార్చాడు. పీజేఆర్ తనకు పెదనాన్న లాంటి వారని, ఆయన లోకల్ లీడర్..నాన్ లోకల్ లీడర్ కాదని, పీజేఆర్ యూనివర్సల్ లీడర్ అంటూ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. రెండ్రోజుల క్రితం కాంగ్రెస్ టికెట్ ప్రకటించిన తర్వాత మీడియాతో మాట్లాడిన నవీన్ యాదవ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే.
పీజేఆర్ ఎమ్మెల్యేగా ఉమ్మడి ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా ఎన్నికైన నాటికి నవీన్ యాదవ్ పుట్టలేదని, ఆయన తండ్రి చిన్న శ్రీశైలం యాదవ్ సైతం పీజేఆర్ అనుచరుడిగా పనిచేశారని, అలాంటి మహానేతను నాన్‌లోకల్ అంటూ ఎలా అంటారంటూ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని పలు బస్తీల్లో అభిమానులు నిరసనలు వ్యక్తం చేశారు. పీజేఆర్ చిత్రపటానికి పాలాభిషేకాలు చేశారు. పీజేఆర్ అభిమానులతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తల నుంచి తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం కావడంతో నవీన్ యాదవ్ మాట మార్చారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో తనకు మద్దతు ఇవ్వాలంటూ ఖైరతాబాద్ నియోజకవర్గం ఇంచార్జి, పీజేఆర్ కుమార్తె విజయారెడ్డి నివాసానికి వెళ్లి కలిశారు.
ఈ సందర్భంగా అక్కడున్న మీడియా ప్రతినిధులు పీజేఆర్ నాన్‌లోకల్ అంటూ చేసిన వ్యాఖ్యలను గుర్తుచేయగా పీజేఆర్ నాన్‌లోకల్ కాదని, ఆయన యూనివర్సల్ లీడర్ అన్నారు. తనకు పీజేఆర్ పెదనాన్న లాంటి వారని, తన తండ్రి కూడా పీజేఆర్ శిష్యుడిగా ఉండి పేరు సంపాదించుకున్నారని వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. అయితే తాను చేసిన వ్యాఖ్యలను వేరే విధంగా చిత్రీకరిస్తున్నారంటూ ఇతర పార్టీలపై నెపం వేసేలా నవీన్ యాదవ్ వ్యాఖ్యలు ఉన్నాయని, పీజేఆర్ మీద తాను చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పి తీరాల్సిందే అని ఆయన అభిమానులు డిమాండ్ చేస్తున్నారు.