సిటీబ్యూరో, అక్టోబరు 23 (నమస్తే తెలంగాణ ): జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నామినేషన్లు, అభ్యర్థుల సంఖ్యలో ఎట్టకేలకు గురువారం స్పష్టత వచ్చింది. కనీసం 150 మంది పోటీలో ఉండే అవకాశం ఉండే అవకాశం ఉందని భావించగా.. ఆ సంఖ్య 81కి తగ్గింది. మంగళవారంతో ముగిసిన నామినేషన్ల స్వీకరణలో 211 మంది 321 నామినేషన్ల సెట్లు దాఖలు చేయగా.. నామినేషన్ల పరిశీలన చేపట్టిన అధికారులు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయంటూ 130 అభ్యర్థులకు చెందిన 186 సెట్ల నామినేషన్లు తిరస్కరించారు. ఇక 81 మందికి చెందిన 153 నామినేషన్లు ఆమోదం పొందాయి.
వీరిలో ఏ ఒక్కరూ కూడా నేటి(శుక్రవారం) విత్ డ్రాలో ఉప సంహరించుకోకపోతే 81 మంది పోటీలో ఉండే అవకాశం ఉంది. బరిలో నిలిచిన వారిలో 30 మంది గుర్తింపు పొందిన, రిజిస్టర్ పార్టీల తరపున పోటీ చేస్తున్న వారి సంఖ్య కూడా భారీగానే ఉంది. ప్రధానంగా గుర్తింపు పొందిన జాతీయ, ప్రాంతీయ పార్టీలలో బీఆర్ఎస్ నుంచి మాగంటి సునీతా గోపినాథ్, కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్, బీజేపీ నుంచి లంకల దీపక్‌రెడ్డి పోటీలో నిలవగా, మరో 27 మంది గుర్తింపు పొందని రిజిష్టర్ పార్టీల నుంచి పోటీలో నిలిచారు. వీరితో పాటు 51 మంది స్వతంత్రులు కూడా బరిలో ఉన్నారు. శుక్రవారం సాయంత్రంలోపు 30 మందికిపైగా తమ నామినేషన్లను ఉపసంహరించుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది.