బంజారాహిల్స్,అక్టోబర్ 17: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతాగోపీనాథ్, కుమార్తె అక్షర తదితరులపై ఎన్నికల కోడ్ ఉల్లంఘన అంటూ తప్పుడు కేసులు పెట్టిన ఎన్నికల సంఘం అధికారులు శుక్రవారం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ నామినేషన్ సందర్భంగా అడుగడుగునా కోడ్ ఉల్లంఘనలకు పాల్పడిన నోరు మెదపలేదు. వేలాది మందితో ర్యాలీ తీయడంతో పాటు సుమారు 6గంటల పాటు రోడ్లను బ్లాక్ చేయడం, రోడ్డుమీద వెళ్తున్న వాహనాలను ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నా అక్కడ విధుల్లో ఉన్న పోలీసులు పట్టించుకోలేదు. దీనికి తోడు నామినేషన్ సందర్భంగా అభ్యర్థి ర్యాలీని క్షుణ్ణంగా పరిశీలించడంతో పాటు వీడియోగ్రఫీ చేయాల్సిన ఎన్నికల సంఘం సిబ్బంది దరిదాపుల్లో సైతం కనిపించలేదని స్థానికులు ఆరోపించారు.
నవీన్ యాదవ్ నామినేషన్ ర్యాలీలో పాల్గొన్న జనం సంఖ్య, అక్కడ ఉపయోగించిన జనరేటర్లు, డీజే సిస్టమ్స్‌తో పాటు సుమారు 50దాకా వాహనాలు ర్యాలీలో పాల్గొన్నాయి. అయితే వీటి వివరాలు నమోదు చేయాల్సిన అధికారులు ఏమాత్రం పట్టించుకోలేదు. కోలాటం, డప్పులు, బోనాలు లాంటి కళారూపాలతో వందలాదిమంది మహిళలను రప్పించారు. వీరికి చెల్లించాల్సిన డబ్బులను లెక్కిస్తే లక్షల్లో తేలుతుంది. దీంతో పాటు గుస్సాడీ, గోండు తదితర సంప్రదాయ కళాకారులు, జానపద నృత్యాల బృందాలకు చెందిన ఖర్చులను లెక్కించాల్సి ఉంటుంది. నామినేషన్ ర్యాలీలో వాడిన వందలాది జెండాలు, రెండుమూడు వాహనాల్లో వచ్చిన వాటర్ బాటిల్స్‌తో పాటు ప్రతి రూపాయిని అభ్యర్థి ఖర్చులో జమచేయాల్సి ఉంటుందని స్పష్టమైన నిబంధనలు ఉన్నా వాటిని పట్టించుకున్న దాఖలాలు కనిపించలేదు.
ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నన్ని రోజులు బహిరంగ సభలు, ర్యాలీల్లో పెట్టే ప్రతి రూపాయికి లెక్క ఉంటుంది. అభ్యర్థి ఖర్చు రూ.40లక్షలకు మించకుండా చూడాల్సి ఉంటుంది. ఎన్నికల ఖర్చును తగ్గించి చూపేందుకు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ సరికొత్త మోసానికి తెరలేపారు నామినేషన్ ర్యాలీకోసం వచ్చిన వేలాదిమందికి స్థానికంగా మహమూద్ గార్డెన్స్‌లో భోజనం ఏర్పాట్లు చేశారు. అయితే ఈ భోజనాలు ఎన్నికల వ్యయం కిందకు రాకుండా లిఖిత్ యాదవ్ అనే వ్యక్తి పుట్టిన రోజు అంటూ రిటర్నింగ్ అధికారివద్దనుంచి అనుమతి తీసుకుని ర్యాలీకి వచ్చిన వారికి భోజనాలు పెట్టారు.
ఫంక్షన్‌హాల్ లోపలికి కండువాలు,టోపీలతో రానిచ్చేది లేదంటూ నిర్వాహకులు చెప్పడంతో వాటిని గేటు బయటే పారవేయడం కనిపించింది. మొత్తం మీద నామినేషన్ రోజున జనసమీకరణ, భోజనం ఏర్పాట్లు, డీజేలు, జెనరేటర్లు, కళాబృందాల ప్రదర్శన లాంటి హంగులకు సుమారు రూ.20లక్షలకు పైగానే ఖర్చయిందని, దాన్ని ఎన్నికల కమిషన్ నమోదు చేస్తుందో, లేదో వేచి చూస్తామని, ఒకవేళ ఖర్చులను తక్కువ చూపిస్తే ఫిర్యాదు చేస్తామని బీఆర్ఎస్ నేతలు పేర్కొన్నారు.