కాచిగూడ, అక్టోబర్ 9: నిరుద్యోగ సమస్యను తరిమికొట్టడానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందని నగర జాయింట్ కమిషనర్, ఈస్ట్ జోన్ డీసీపీ రమేష్ రెడ్డి అన్నారు. నగర కమిషనర్ ఆదేశాల మేరకు కాచిగూడ ఇన్స్పెక్టర్ హబీబుల్లాఖాన్ ఆధ్వర్యంలో ప్రైవేటు రంగాల్లో ఉద్యోగ అవకాశాలను కల్పించడానికి నాన్ టెక్నికల్ నిరుద్యోగ యువకులకు కాచిగూడ పోలీస్‌స్టేషన్‌లో శనివారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 2 గంటల వరకు జాబ్ మేళాను నిర్వహించారు. ఈ మేళాలో 5 పంపెనీల ప్రతినిధులు పాల్గొని దాదాపు 100 మంది నిరుద్యోగ యువకుల వద్ద బయోడేటాను తీసుకొనగా, అందులో 73 మంది ఉద్యోగాలకు ఎంపికయ్యారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డీసీపీ రమేశ్‌రెడ్డి హాజరై మాట్లాడుతూ నిరుద్యోగులకు ఉపాధిని కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతుందని పేర్కొన్నారు. నేర రహిత సమాజ నిర్మాణమే తెలంగాణ పోలీసుల లక్ష్యమని, దీనిలో భాగంగానే నిరుద్యోగ యువకులకు పలు ఉద్యోగాలను కల్పిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో కాచిగూడ ఏసీపీ ఆకుల శ్రీనివాస్, డీఐ యాదేందర్, ఎస్సైలు శ్రీనివాస్, వి.లక్ష్మయ్య, బి.నాగార్జునరెడ్డి సిబ్బంది పాల్గొన్నారు.