Jiyaguda | జియాగూడ, మే 16 : జియాగూడ శ్రీ రంగనాథ స్వామి దేవాలయం బ్రహ్మోత్సవాలకు సిద్ధమైంది. ఈ నెల 19వ తేదీ నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానుండటంతో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. సోమవారం ఉదయం శ్రీరంగనాథ స్వామి మూల విరాట్టు ప్రాణ ప్రతిష్ట చేయగా.. సాయంత్రం నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 20వ తేదీ ఉదయం 10 గంటలకు గరుడ ప్రసాద పంపిణీ కార్యక్రమం నిర్వహించనున్నారు. సంతానం లేని మహిళల కోసం ప్రత్యేకంగా విశిష్ట పూజలు నిర్వహించి, వారికి మాత్రమే గరుడ ప్రసాదం ఇవ్వనున్నారు.
బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ నెల 22వ తేదీ సాయంత్రం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ రంగనాథ స్వామి కల్యాణ మహోత్సవం నిర్వహించనున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు శ్రీనివాస రంగనాథ చార్యులు తెలిపారు. గరుడ ప్రసాద స్వీకరించిన మహిళలు కుటుంబ సభ్యులతో కల్యాణ మహ్మోత్సవంలో పాల్గొనవచ్చని పేర్కొన్నారు. ఈ నెల 23 న స్వామి వారి రథోత్సవం నిర్వహించనున్నారు. ఆలయ ప్రాంగణం నుంచి పురానాపూల్ చౌరస్తా వరకు ఊరేగింపు చేయనున్నారు. ఈ నెల 24వ తేదీన చక్రస్నానం, 25వ తేదీన లక్షా 25 వేల పూలతో పుష్పయాగం, ద్వాదశ ఆరాధన, సాయంత్రం 108 కళశాలతో దేవేరులకు మహాభిషేకం నిర్వహించనున్నారు. ఈ నెల 28వ తేదీన మహాపూర్ణాహుతి, 1001 కళశాలతో సహస్ర కళశాభిషేకంతో ఉత్సవం సమాప్తి అవ్వనుంది.
ఈ నేపథ్యంలో బ్రహ్మోత్సవాల ప్రారంభానికి సంబంధించిన బ్రోచర్‌ను ఆలయ ఫౌండర్ ట్రస్టీ ఎస్టీ చారి, ప్రతినిధి శేషాచారి, ఆలయ ప్రధాన అర్చకులు శ్రీనివాస రంగనాథచార్యులు, బద్రీనాథ్ చారి శ్రీ రంగనాథ సేవా సమితి సభ్యులతో కలిసి విడుదల చేశారు. అనంతరం ఆలయ ప్రతినిధి శేషా చారి మాట్లాడుతూ… గత రెండు సంవత్సరాల నుండి ఆలయ జీర్ణోద్దారణ పనులు వాస్తు, శాస్త్ర శిల్ప కళలతో శ్రీరంగం, కంచి, శ్రీ కాళహస్తి తరహాలో ఆలయాన్ని నిర్మిస్తున్నామని, ప్రస్తుతం బాల లయంలో స్వామి వారికి పూజలు, భక్తులకు దర్శనం కల్పిస్తున్నమన్నారు.