సిటీబ్యూరో, ఫిబ్రవరి 23 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ పబ్లిక్ సూల్ అంటే పేరెన్నికగల విద్యాసంస్థ. దేశంలోని 20 ప్రసిద్ధ పాఠశాలల్లో బేగంపేటలోని హైదరాబాద్ పబ్లిక్ సూల్ ఒకటిగా పేరుగాంచింది. నవాబులు, జాగీర్దార్లు, బ్రిటిష్ అధికారుల పిల్లల చదువుల కోసం 1919లో పాఠశాల ఏర్పాటును అప్పటి 7వ నిజాం నవాబ్ మీర్ ఉస్మాన్ అలీఖాన్ ప్రతిపాదించారు. 1923లో ‘జాగీర్దార్ సూల్’ పేరుతో ప్రారంభమైన హైదరాబాద్ పబ్లిక్ స్కూల్.. అప్పటి జాగీర్దార్లలో ఒకరైన సర్ వికార్-ఉల్-ఉమా బహుల్ ఖానగూడ పేరుతో ప్రస్తుత బేగంపేటలో దీర్ఘకాల లీజ్ ప్రాతిపదికన పాఠశాలకు స్థలాన్ని కేటాయించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు స్కూల్ ఎంతోమందిని ఉన్నతులుగా తీర్చిదిద్దింది. పాఠశాల లోగో ఈగల్ (గరుడ పక్షి)కు తగ్గట్లుగానే గ్లోబల్ వేదికపై మన మహానగర ఖ్యాతిని ఇనుమడింపజేసింది. 2023తో నూరేండ్ల విద్యారంగం చరిత్రలో ఘనమైన రికార్డులను నమోదు చేసుకున్నది.
జమిందారీ వ్యవస్థ రద్దుతో అందరికి విద్య..
అయితే 1950లో ప్రభుత్వం జమిందారీ వ్యవస్థను రద్దు చేయడంతో.. అప్పటి వరకు కేవలం ప్రముఖుల పిల్లలకే పరిమితమైన జాగీర్దార్ పాఠశాల.. ఇండియన్ పబ్లిక్ స్కూల్ ఆఫ్ కాన్ఫరెన్స్‌లో హైదరాబాద్ పబ్లిక్ సూల్గా నమోదై తన సేవలను అందరికి పంచింది.
చదువుల మహావృక్షం హెచ్‌పీఎస్..
విద్యార్థి టీచర్ల నిష్పత్తి 18.1, విద్యార్థుల పాస్ శాతం నూటికి నూరు శాతంగా ఉంది. విద్యార్థులకు ప్రత్యేకంగా 44 క్రీడా ప్రాంగణాలు ఉన్నాయి. 2800 మంది విద్యార్థులతో విద్యా బోధనలో కొనసాగుతున్నది. ప్రీ ప్రైమరీ, ప్రైమరీ, మిడిల్ స్కూల్, ఉన్నత పాఠశాలను నిర్వహిస్తున్నది.
హెచ్‌పీఎస్‌లో చదివిన ప్రముఖులు..
ప్రముఖ పూర్వవిద్యార్థులు ఈ పాఠశాలలో విద్యాభ్యాసం చేసిన ఎందరో నేడు ఉన్నత శిఖరాలను అధిరోహించారు. వారిలో కొందరు..మాజీ మంత్రి అశోక్‌గజపతిరాజు, టీకే కురియన్, ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి, మాజీ సీఎం నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ, మాజీ ఎంపీలు జి.వివేక్, పల్లం రాజు, కనుమూరి బాపిరాజు, నాదెండ్ల మనోహర్, ఐపీఎస్ సీవీ ఆనంద్, మాజీ ఐపీఎస్ అధికారి దినేశ్‌రెడ్డి, బాలీవుడ్ నటుడు వివేక్ ఒబేరాయ్, ఫ్రాన్స్ భారత మాజీ రాయబారి వీర్ మొహిసిన్ సయీద్, క్రికెట్ వ్యాఖ్యాత హర్షాభోగ్లే, సినీనటులు అక్కినేని నాగార్జున, సత్య నాదెళ్ల (మైక్రోసాఫ్ట్), శంతను నారాయణ (అడోబ్ సిస్టమ్స్ సీఈఓ)లతోపాటు మరెందరినో ఉన్నత శిఖరాలకు చేర్చింది.