సిటీబ్యూరో, ఫిబ్రవరి 17 (నమస్తే తెలంగాణ) : సీఎం కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా నగరంలోని పలు యూనివర్సిటీలలో ఘనంగా హరితహారం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉస్మానియా యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ రవీందర్, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ ఎల్.లింబాద్రి ముఖ్య అతిథిగా పాల్గొని మొక్కలు నాటారు.
జేఎన్టీయూ హైదరాబాద్ యూనివర్సిటీ క్యాంపస్‌లో ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో నిర్వహించిన హరితహారంలో వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ కట్టా నరసింహారెడ్డి మొక్కలు నాటారు. యూనివర్సిటీ రెక్టార్ ప్రొఫెసర్ గోవర్ధన్, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ మంజూర్ హుస్సేన్, ఓఎస్డీ బానోత్ ధర్మానాయక్, ఎన్ఎస్ఎస్ అధికారిని శోభ, వాలంటీర్లు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
ఉస్మానియా యూనివర్సిటీ, ఫిబ్రవరి 17: ఉస్మానియా యూనివర్సిటీలో సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా టీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. ఇరవై రోజులుగా నిర్వహించిన ఈ టోర్నమెంట్లో మొదటి మూడు స్థానాల్లో నిలిచిన జట్లకు గురువారం బహుమతులను అందజేశారు. ఓయూ ఆర్ట్స్ కళాశాల ఆవరణలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీసీ కమిషన్ సభ్యుడు శుభప్రద్ పటేల్ హాజరయ్యారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో టీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుంగ బాలు మాట్లాడుతూ.. మొదటి స్థానంలో నిలిచిన జట్టుకు రూ.లక్ష, రెండో స్థానంలో నిలిచిన జట్టుకు రూ.50,000, మూడో స్థానంలో నిలిచిన జట్టుకు రూ.25,000 నగదు బహుమతులతో పాటు ట్రోఫీలను అందజేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఓయూ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యుడు ప్రకాశ్, రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ సభ్యుడు డాక్టర్ విద్యాసాగర్, అంతర్జాతీయ షూటర్ సురభి భరద్వాజ్, విద్యార్థి నాయకులు వీరబాబు, రఘురాం, టోర్నమెంట్ నిర్వాహకుడు నరేశ్, టీఆర్ఎస్వీ నాయకులు వెంకట్, శ్రీకుమార్, కృష్ణ, హరిబాబు, నవీన్‌గౌడ్, సంపత్, కృష్ణప్రసాద్, ప్రభాకర్, మురళి తదితరులు పాల్గొన్నారు.
సిటీబ్యూరో, ఫిబ్రవరి 17 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్(టీజీవో) జలమండలి శాఖ ఆధ్వర్యంలో ఖైరతాబాద్‌లోని జలమండలి ప్రధాన కార్యాలయంలో సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. టీజీవో హైదరాబాద్ జిల్లా కోశాధికారి, టీజీవో జలమండలి శాఖ అధ్యక్షుడు ఎండీ అబ్దుల్ ఖాదర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి టీజీవో హైదరాబాద్ అధ్యక్షుడు ఎంబీ కృష్ణయాదవ్, కార్యదర్శి టి.హరికృష్ణ, అసోసియేట్ ప్రెసిడెంట్ ఎన్.శ్రీనీష్, టీజీవో జలమండలి శాఖ కార్యదర్శి చంద్రజ్యోతి, టీజీవో హైదరాబాద్ ఉపాధ్యక్షురాలు బి.స్వరూప, ఈసీ మెంబర్ జె.పూనమ్, కార్యనిర్వాహక కార్యదర్శి గోపీచంద్, జలమండలి శాఖ అసోసియేట్ ప్రెసిడెంట్ పి.సంతోష్ కుమార్, సోషల్ వరర్ ఏవీ రావు, టీఎన్జీవో జలమండలి శాఖ అధ్యక్షులు మహేశ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఆచార్య ఎస్వీ సత్యనారాయణ
తెలుగుయూనివర్సిటీ, ఫిబ్రవరి 17 : నిరంతరం ప్రజా ఉద్యమాల్లో భాగస్వామినై కృషిని కొనసాగిస్తున్నట్లు ప్రముఖ కవి, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పూర్వ ఉపాధ్యక్షుడు ఆచార్య ఎస్వీ.సత్యనారాయణ అన్నారు. తెలంగాణ సారస్వత పరిషత్తులో కొనసాగుతున్న పరిణత వాణి ప్రసంగం కార్యక్రమంలో భాగంగా గురువారం ఆయన 93వ ప్రసంగం చేశారు. హైదరాబాద్ పాత నగరంలో మధ్య తరగతి కుటుంబంలో పుట్టిన తనకు పాఠశాల స్థాయిలోనే గురువుల ప్రోత్సాహం లభించిందని తెలిపారు. 1970లో వచన కవిత్వం ప్రారంభించి, ఇప్పటి వరకు వచన, గేయ కవిత్వం, జీవిత చరిత్రలు, విమర్శలు, పరిశోధనలతో కలిపి సుమారు 30 గ్రంథాలు రచించానని తెలిపారు. మరో 30 ప్రత్యేక సంచికలకు సంపాదకత్వం వహించానని పేర్కొన్నారు. రేడియో రంగస్థలం టీవీ, సినిమా మాధ్యమాలలో కూడా పలు రచనలు వెలువడ్డాయని తెలిపారు. అభ్యుదయ రచయితల సంఘం, ప్రజా నాట్యమండలి వంటి ప్రజా సంఘాలలో కీలకపాత్ర వహించానని, ఓయూలో తెలుగు శాఖ అధ్యక్షులుగా అనంతరం తెలుగు విశ్వవిద్యాలయంలో ఉపాధ్యక్ష భాధ్యతలు నిర్వహించానని తెలిపారు. కార్యక్రమంలో పరిషత్తు అధ్యక్షులు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి, ప్రధాన కార్యదర్శి డాక్టర్ జుర్రు చెన్నయ్య పాల్గొన్నారు. శుక్రవారం ప్రముఖ గేయ రచయిత డాక్టర్ సుద్దాల అశోక్ తేజ పరిణత వాణి ప్రసంగం ఉంటుందని నిర్వాహకులు తెలిపారు.