సిటీబ్యూరో: వర్షాకాలంలో వచ్చే ఫిర్యాదుల పరిష్కారానికి అన్ని ఏర్పాట్లు చేసినట్లు జలమండలి ఎండీ సుదర్శన్ రెడ్డి తెలిపారు. వినియోగదారుల నుంచి ఫిర్యాదులు స్వీకరించేందుకు, పర్యవేక్షించేందుకు జలమండలి కమాండ్ కంట్రోల్ రూం 24 గంటలు పనిచేస్తుందన్నారు. ప్రత్యేకంగా నీరు నిలిచే 125 హాట్‌స్పాట్స్ గుర్తించామని, ఇందుకు మూడు షిఫ్టుల్లో సిబ్బంది పనిచేస్తారని ఎండీ చెప్పారు. వర్షాకాల ప్రణాళిక, అమలుపై శుక్రవారం ఖైరతాబాద్ సంస్థ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎండీ సుదర్శన్‌రెడ్డి మాట్లాడారు. మూడు షిఫ్టులు, 24 గంటలు క్షేత్రస్థాయిలో పనిచేస్తూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాయని, జీహెచ్ఎంసీ కోర్ సిటీతో పాటు శివార్లలోనూ బృందాలు పర్యటిస్తాయని సుదర్శన్‌రెడ్డి తెలిపారు. వర్షాకాలంలో జలమండలి ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం (ఈఆర్టీ) బృందాలను రంగంలోకి దింపామని, 16 ఎమర్జెన్సీ బృందాల్లో ఒక్కో బృందంలో ఐదుగురు ఉంటారని వివరించారు. ఈ కార్యక్రమంలో జలమండలి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ ఎం.సత్యనారాయణ, రెవెన్యూ డైరెక్టర్ వీఎల్ ప్రవీణ్‌కుమార్ పాల్గొన్నారు.
జలమండలిలో ‘డయల్ యువర్ ఎండీ’ శనివారం నుంచి పునః ప్రారంభం కానున్నది. ఖైరతాబాద్ సంస్థ ప్రధాన కార్యాలయంలో ఎండీ సుదర్శన్‌రెడ్డి అధ్యక్షతన సాయంత్రం 4 గంటల నుంచి 5.30 గంటల వరకు ఈ కార్యక్రమం జరగనున్నదని అధికారులు తెలిపారు. కొవిడ్ కంటే ముందు ప్రతి నెలా మూడో శనివారం ‘డయల్ యువర్ ఎండీ’ కార్యక్రమం జరిగేది.