సిటీబ్యూరో, జూన్ 3 (నమస్తే తెలంగాణ): మలక్‌పేట్ అక్బర్ ప్లాజా వద్ద తలెత్తిన మురుగు సమస్యను జలమండలి ఎండీ అశోక్ రెడ్డి మంగళవారం పరిశీలించారు. రెండు దశాబ్ధాల క్రితం నిర్మించిన సీవరేజ్ లైన్ శిథిలమైపోవడంతో అవుట్లెట్ లేక, వర్షం కురిసిన సమయాల్లో రహదారిపై మురుగు పొంగుతున్నట్టు గుర్తించారు.
కొత్త సివరేజ్ లైన్ల వలన తాత్కాలికంగా మురుగు సమస్య తలెత్తకుండా ఉంటుందన్నారు. సమీపంలోని భవనాల నుంచి ఉత్పన్నమయ్యే మురుగును ఎక్కడికక్కడే కాకుండా ఒకే అవుట్లెట్ వద్ద అనుసంధానం చేయడానికి ఏర్పాట్లు చేయాలని అశోక్‌రెడ్డి అధికారులకు సూచించారు. నగరంలోని సీవరేజ్, వాననీటి కాలువ అనుసంధానం అయ్యే పాయింట్లను గుర్తించి, ఆ ప్రాంతాల్లో రెండు లైన్లను వేరువేరుగా నిర్మించి, సమస్య తలెత్తకుండా చూడాలన్నారు.
హోటల్ యజమానికి జరిమానా…
నల్గొండ చౌరస్తాకు ఆనుకొని ఉన్న భవనంలో హోటల్ యజమాని తన సీవరేజ్ లైన్‌ను నేరుగా జలమండలి సీవరేజ్ నెట్‌వర్క్‌కు అనుసంధానం చేసి అందులో ఆహార, వ్యర్థ పదార్థాలను వేస్తూ వస్తున్న కారణంగా, ఆ ప్రాంతంలో మ్యాన్‌హోళ్లు నిండిపోయి రహదారులపై మురుగు పారుతోంది.
పరిశీలనలో ఇది బయటపడటంతో సీవరేజ్ ఓవర్ ఫ్లోకు కారణమైన హోటల్ యజమానికి రూ.10 వేల జరిమానా విధించాలని అశోక్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. అలాగే 10 రోజులలో సిల్ట్ ఛాంబర్ నిర్మించుకోకపోతే జీహెచ్ఎంసీ అధికారులతో మాట్లాడి హోటల్‌ను సీజ్ చేయించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆపరేషన్ డైరెక్టర్ అమరేందర్ రెడ్డి, సీజీఎం నాగేందర్, జీఎం, ఇతర అధికారులు, హైడ్రా అధికారులు తదితరులు పాల్గొన్నారు.