సిటీబ్యూరో , జనవరి 2 (నమస్తే తెలంగాణ ): సీఎం కేసీఆర్ మార్గదర్శకత్వం, మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో ఈ ఏడాది కూడా మరిన్ని నూతన ప్రాజెక్టులకు శ్రీకారం చుడతామని జలమండలి ఎండీ దానకిశోర్ పేర్కొన్నారు. జలమండలి ఎండీగా తాను బాధ్యతలు చేపట్టి ఏడేండ్లు అవుతున్నదని, దీనిని ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నానని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం సైతం బోర్డుపై నమ్మకం ఉంచి తనకు అనేక బాధ్యతలు అప్పగించిందని, వాటిని జలమండలి సమర్థంగా నిర్వహించిందన్నారు. ఖైరతాబాద్‌లోని ప్రధాన కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు.
జలమండలి ఇంజినీర్స్ అసోసియేషన్ (జేఈఏ) ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలకు ఎండీ దానకిశోర్ ముఖ్య అతిథిగా హాజరై జేఈఏ డైరీ, క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. ఆనంతరం కేక్ కట్ చేశారు. జలమండలి అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది, వినియోగదారులకు ఎండీ దానకిశోర్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. గత ఏడాది సుంకిశాల ప్రాజెక్టు, 31 కొత్త ఎస్టీపీల నిర్మాణం, ఓఆర్ఆర్ ఫేజ్-2.. తదితర ముఖ్యమైన ప్రాజెక్టులు చేపట్టామన్నారు. ప్రస్తుతం వాటి పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. తొందరలోనే వీటిని పూర్తి చేస్తామన్నారు.
కాంట్రాక్టర్లను ఒకే తాటిపై తీసుకువచ్చి పనులు వేగంగా జరిగేలా చూశామని ఎండీ దానకిశోర్ వివరించారు. జలమండలి అధికారులు, ఇంజినీర్ల సమష్టి కృషితో ప్రజలకు మరింత మెరుగైన సేవలందించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఈడీ డాక్టర్ ఎం. సత్యనారాయణ, డైరెక్టర్లు శ్రీధర్ బాబు, వీఎల్ ప్రవీణ్‌కుమార్, అజ్మీరా కృష్ణ, రవికుమార్, జలమండలి ఇంజినీర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజశేఖర్, ప్రధాన కార్యదర్శి హరిశంకర్, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.