e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, January 26, 2022
Home News జై జవాన్ మీ త్యాగాలకు సలాం

జై జవాన్ మీ త్యాగాలకు సలాం

  • త్యాగాల కుటుంబాలకు అండగా నిలిచిన తెలంగాణ ప్రభుత్వం
  • దేశం కోసం అమరులైనతెలుగు తేజాలు

మన బంధాలతో మనం సంతోషంగా ఉండటం కోసం.. వారు బంధాలకు దూరంగా ఉంటున్నారు.. అనుబంధాన్ని త్యాగం చేస్తున్నారు. దేశ సరిహద్దుల్లో అనాథలుగా మారి మనకు పహారా కాస్తున్నారు. వారి తనువంతా శిథిలమై పోతున్నా.. మన ప్రాణాలను పదిలంగా కాపాడుతున్న వీర జవాన్లకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలం. మనస్ఫూర్తిగా సెల్యూట్‌ చేయడం తప్పా..

సిటీబ్యూరో, జనవరి 14 (నమస్తే తెలంగాణ) : భారత రక్షణ వ్యవస్థలో ఇండియన్‌ ఆర్మీది కీలక పాత్ర. మన దేశ భూభాగాన్ని పరిరక్షించడంతో పాటు దేశ సరిహద్దుల భద్రతలో రాజీలేని పోరాటాన్ని కొనసాగిస్తున్నది. అంతేకాదు ఐక్యరాజ్య సమితి చేపట్టిన అనేక కార్యకలాపాల్లోనూ పాల్గొంటున్నది. ముఖ్యంగా శాంతి పరిరక్షణలో భారత సైనిక దళం పాలుపంచుకొన్నది. 1947లో స్వాతంత్య్రం వచ్చిన అనంతరం మొదటి కశ్మీర్‌ యుద్ధం నుంచి మొదలుకొని నేటి వరకు వారి త్యాగాలు నిరుపమానం. అమర జవాన్ల త్యాగాన్ని వెలకట్టలేం. ఈ సందర్భంగా కొందరు తెలుగు తేజాలను గుర్తు చేసుకుందాం.

- Advertisement -

చిన్నవయస్సులోనే అమరుడైన ర్యాడ మహేశ్‌

నిజామాబాద్‌ జిల్లా వేల్పూర్‌ మండలం కొమన్‌పల్లికి చెందిన ర్యాడ మహేశ్‌ 26 ఏండ్ల వయస్సులోనే అమరుడయ్యాడు. 2020లో జమ్మూ కశ్మీర్‌లో జరిగిన ముష్కరుల కాల్పుల్లో వీరమరణం పొందారు. చిన్నప్పటి నుంచే ఆర్మీలో చేరి దేశానికి సేవలందిస్తానని చెప్పేవాడు. అనుకున్న విధంగానే సైన్యంలో చేరాడు. సరిహద్దుల్లో భారత సైన్యానికి ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో అసువులుబాషాడు. ప్రేమవివాహం చేసుకున్న ఏడాదికే మహేశ్‌ అమరుడవడం అందరినీ కంటతడి పెట్టించింది. మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి చొరవతో మహేశ్‌ భార్యకు రిజిస్ట్రేషన్‌ శాఖలో ఉద్యోగావకాశాన్ని కల్పించారు. మహేశ్‌ తల్లిదండ్రులను ఆర్థికంగా ఆదుకున్నారు.

వీరమరణం పొందిన ప్రవీణ్‌కుమార్‌రెడ్డి

చిత్తూరు జిల్లా ఐరాల మండలం రెడ్డివారిపల్లికి చెందిన ప్రవీణ్‌కుమార్‌రెడ్డి 2020లో జమ్మూ కశ్మీర్‌లో జరిగిన ముష్కరుల కాల్పుల్లో వీరమరణం పొందాడు. ప్రవీణ్‌కుమార్‌కు భార్యా, ఇద్దరు పిల్లలున్నారు. కశ్మీర్‌లో ముష్కరులతో పోరాడుతూ ప్రవీణ్‌కుమార్‌రెడ్డి అమరుడయ్యాడు. మద్రాస్‌ రెజిమెంట్‌లో హవల్దార్‌గా విధులు నిర్వహిస్తున్న ఆయన కమాండో శిక్షణ తీసుకున్న అనంతరం కశ్మీర్‌కు వెళ్లాడు. విధులు నిర్వహిస్తున్న సమయంలో ముష్కరులతో పోరాడుతూ వీరమరణం పొందాడు.

గల్వాన్‌ వీరుడు కల్నల్‌ సంతోష్‌బాబు

తెలంగాణలోని ఉమ్మడి నల్గొండ జిల్లా సూర్యాపేటకు చెందిన కల్నల్‌ సంతోష్‌బాబు బీహార్‌ రెజిమెంట్‌లోని 16వ బెటాలియన్‌లో పనిచేస్తూ.. భారత్‌-చైనా సరిహద్దులోని తూర్పు లద్దాఖ్‌ పరిధి గల్వన్‌ లోయలో శత్రుదేశం దుర్మార్గాలకు 2020లో వీరమరణం చెందాడు. గల్వాన్‌ లోయలోని పెట్రోలింగ్‌ పాయింట్‌ వద్ద భారత్‌-చైనా మధ్య జరిగిన ఘర్షణలో శత్రువులను అడ్డుకునే క్రమంలో అమరుడయ్యాడు. సైన్యంలో 15 ఏండ్లుగా వివిధ హోదాల్లో సేవలందించాడు. చిన్నప్పటి నుంచి చదువులో చురుకైన విద్యార్థిగా ఉన్నాడు. కోరుకొండ సైనిక్‌ స్కూల్‌ ఎన్డీఏలో గోల్డ్‌ మెడల్‌ అందుకున్నాడు. సంతోష్‌కు భార్యా, కుమార్తె, కుమారుడు ఉన్నారు. సంతోష్‌ కుటుంబాన్ని తెలంగాణ ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకొని ఆయన భార్యకు ఉన్నతోద్యోగం కల్పించింది.

అమరుల కుటుంబాలకు అండగాతెలంగాణ ప్రభుత్వం

ఎంతో మంది అమరుల కుంటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం అండగా నిలుస్తున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆధ్వర్యంలో బాధిత కుటుంబాలను ఆర్థికంగా ఆదుకుంటూ కొండత ధైర్యాన్ని నింపేప్రయత్నం చేస్తున్నది. నిజమాబాద్‌ జిల్లా వేల్పూర్‌ మండలం కొమన్‌పల్లి అమర జవాన్‌ కుటుంబాన్ని మంత్రి ప్రశాంత్‌రెడ్డి చొరవ తీసుకొని ఆదుకున్నారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన కుటుంబాలను ఆదుకోవడం గొప్పవిషయం. ఆర్థికసాయం అందించి.., ఉద్యోగాలను ప్రకటించి సీఎం కేసీఆర్‌ ఎంతో ఓదార్పునిచ్చారు. తెలుగు ప్రాంత సైనికులకే కాదు గల్వాన్‌ అమరులందరికీ ఆర్థిక సాయం ప్రకటించి తన మంచిమనసును చాటారు.

  • ఎస్‌.స్వామిరావు, నాయక్‌ సుబేదార్‌(రిటైర్‌మెంట్‌), జానకంపేట, నిజామాబాద్‌
Advertisement

Most Viewed

-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement