హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 16 ( నమస్తే తెలంగాణ ): ప్రభుత్వం కొత్తగా ఆటోపర్మిట్లు ఇవ్వొద్దని తెలంగాణ స్టేట్ ఆటో ట్యాక్సీ డ్రైవర్స్ యూనియన్ డిమాండ్ చే సింది. కాంగ్రెస్ సర్కారు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మంగళవారం హైదర్‌గూడలో జేఏసీ సమావేశం కానున్నట్టు యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెంటయ్యగౌడ్ తెలిపారు.
ఇప్పటికే ఆటోలకు గిరాకీ లేదు, అవసరం లేకున్నా ప్రభుత్వం కొత్తగా ఆటోపర్మిట్లు జారీ చేయడమేంటి? ఎవరి ప్రయోజనాల కోసం ఆటో పర్మిట్లు ఇస్తున్నారు? విధివిధానాలు ఎందుకు గోప్యంగా ఉంచుతున్నారు? ఉపాధి కోల్పోయిన ఆటోడ్రైవర్లను ఆదుకోవడంపై ప్రభుత్వం దృష్టి సారించాలి” అని పేర్కొన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆటోడ్రైవర్లకు కష్టాలు మొదలయ్యాయని, ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకంతో ఉపాధి కోల్పోయామని ఆవేదన వ్యక్తంచేశారు. ఆర్థిక ఇబ్బందులతో ఆటోడ్రైవర్లు ఆత్మహత్య చేసుకోవాల్సిన దుస్థితి వచ్చిందని మండిపడ్డారు.
సమస్యలు పరిష్కరించాలని ఏడాదిన్నరగా ఉద్యమిస్తున్నా ప్ర భుత్వం పట్టించుకోవడంలేదని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో పేర్కొన్న ఆటో డ్రైవర్లకు ఏడాదికి రూ.12వేలు ఆర్థిక సాయం, సంక్షేమ బోర్డు ఏమయ్యాయని ప్రశ్నించారు. అసత్య హామీలతో కాంగ్రెస్ పార్టీ తమను మోసం చేసిందని మండిపడ్డారు. జేఏసీ సమావేశంలో టీఏవోడీఏ, బీపీటీఎంఎం, బీఎంఎస్, టీఆర్ఏకేటీయూ, టీఏడీయూ, ఎన్టీఏడీయూ, టీఎస్ఏడీయూ, జీహెచ్ఎస్వీడీయూ తదితర సంఘాల నాయకులు హాజరై, భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తారని పేర్కొన్నారు.