గత ప్రభుత్వ హయాంలో రిటైర్డ్ అధికారులను కీలక పోస్టుల్లో కొనసాగిస్తూ విచ్చలవి డిగా అక్రమాలకు పాల్పడ్డారంటూ ధ్వజమెత్తిన ప్రస్తుత ప్రభుత్వ పెద్దల మాటలకు, క్షేత్రస్థాయిలో మున్సిపల్ శాఖలో జరుగుతున్న పరిణామాలకు ఏమాత్రం పొంతన లేకుండా పోతోంది. ఇప్పుడు అదే రిటైర్డ్ ఉద్యోగుల పునర్ నియామకం కోసం కొందరు ప్రభుత్వ పెద్దలు పట్టుబడు తుండటం పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ విభాగంలో హాట్ టాఫిక్ గా మారింది. ముఖ్యమంత్రి సొంత శాఖలోనే ఈ తరహా వ్యవహారాలు సాగుతుండటంపై ఇంజనీరింగ్ వర్గాల్లో తీవ్ర చర్చ నడుస్తోంది.
సిటీబ్యూరో, జులై 2 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర మున్సిపల్ పరిపాలన శాఖను స్వయ ంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యవేక్షిస్తున్నారు. అయితే ఇటీవల కాలంలో ఈ శాఖలో జరిగిన ఇంజనీర్ల బదిలీల్లో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ప్రభు త్వం ఇచ్చిన జీవోలను సైతం మున్సిపల్ అధికారులు అమలు చేయకపోవడం తీవ్ర దుమారాన్ని లేపింది. ఇందులో భాగంగానే తాజాగా రిటైర్ అయిన ఇద్దరు సూపరింటెండెంట్ ఇంజనీర్లలో ఒకరైన అశోక్ రెడ్డి వ్యవహారం మున్సిపల్ వర్గాల్లో తీవ్ర సంచలనంగా మారింది. మలాజ్ గిరి మున్సిపల్ కార్పొరేషన్లో అర్హత లేకున్నా ఆయన చీఫ్ ఇంజనీర్ (సీఈ)గా అదనపు బాధ్యతలు దకించుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.. ఆ సమయంలో తనకన్నా సీనియర్లు దీనిపై ప్రశ్నిస్తే.. నేను నాలుగు నెలల్లో (జూన్ 30న) రిటైర్ అవుతాను.. ఆ తర్వాత ఈ పోస్టు మీకే దకుతుంది.. నన్ను సీఈగా రిటైర్ అవ్వనివ్వండి అంటూ బతిమాలుకున్నట్లు చర్చ జరిగింది.
ఈ క్రమంలోనే జూన్ 30న అశోక్‌రెడ్డి పదవీ విరమణ చేశారు. ఈ క్రమంలోనే రిటైర్మెంట్ సమయం వచ్చేసరికి సదరు అధికారి సర్వీస్ ఎక్స్ టెన్షన్ లేదా రీ-అపాయింట్ మెంట్ కోసం తీవ్రస్థాయిలో పైరవీలు మొదలుపెట్టినట్లు ప్రస్తుతం ఇంజనీరింగ్ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. సీఎం సొంత జిల్లాకే చెందిన ఈ రిటైర్డ్ అధికారి, ఏదో ఒక రకంగా మళ్లీ అదే స్థానంలో కూర్చోవడానికి శతవిధాలా ప్రయత్నిస్తున్నారన్న ప్రచారం ఉంది. ఆయన రిటైర్మెంట్ ఫంక్షన్ ముగిసినా కూడా ఆ పోస్టుపై మకువ వదులుకోకపోవడం, మరోవైపు మలాజ్ గిరి కార్పొరేషన్లో ఖాళీ అయిన సీఈ పోస్టును మరొకరికి అప్పగించకుండా, కనీసం పూర్తి అదనపు బాధ్యతలు (ఎఫ్ఏసీ) కూడా ఎవరికీ ఇవ్వకుండా ఖాళీగా ఉంచడం ఈ అనుమానాలకు బలం చేకూరుస్తోంది.
కీలక స్థానాన్ని భర్తీ చేయకపోవడంలో అంతర్యం?
సాధారణంగా అత్యంత కీలకమైన ఇలాంటి ఉన్నత స్థాయి పోస్టుల్లో ఉన్న వారు ఒక రోజు సెలవు పెట్టినా ఇంఛార్జిని నియమించడం ఆనవాయితీ. కానీ మలాజ్ గిరి కార్పొరేషన్ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి మాత్రం వేచి చూసే ధోరణి అవలంబిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. సదరు అధికారి మళ్లీ వస్తారనే ధీమాతోనే కమిషనర్ ఈ సీటును ఖాళీగా ఉంచినట్లు కార్పొరేషన్ వర్గాల్లో వినపడుతోంది. ఇక మరోవైపు జీహెచ్ఎంసీ ప్రాజె క్టు విభాగంలో సూపరింటెండెంట్ ఇంజనీర్ (ఎస్ఈ)గా పనిచేసి రిటైర్ అయిన మోహన్ రెడ్డిని సైత ం అదే పోస్టులో కొనసాగించేందుకు ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది.
వాస్తవానికి తమ కార్పొరేషన్ల పరిధిలో కీలక ఇంజనీరింగ్ పోస్టులు ఖాళీ అయితే.. ఆ పనులు నిర్వహించేందుకు అర్హత, సామర్థ్యం ఉన్న అధికారులను నియమించాలని ఈఎన్సీని లేదా ప్రభుత్వాన్ని కోరాల్సిన కమిషనర్లు, రిటైర్డ్ అధికారుల కోసమే పట్టుబట్టడం వెనుక అసలు ఆంతర్యమేమిటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పదోన్నతుల కోసం, తమ సామర్థ్యాన్ని నిరూపించుకోవడానికి ఎంతోమంది సీనియర్ ఇంజనీర్లు ఎదురుచూస్తుంటే, వారిని కాదని రిటైర్డ్ అయిన వారికే మళ్లీ పెద్దపీట వేయడంపై సర్వత్రా అసంతృప్తి వ్యక్తమవుతోంది. మొత్తంగా రెండు రోజులుగా కీలక స్థానాన్ని భర్తీ చేయకపోవడం అభివృద్ధి పనులపై తీవ్ర ప్రభావం పడుతున్నది.
మహిళా అధికారికి అన్యాయం?
పనిచేస్తున్న ఒక మహిళా అధికారి పట్ల కమిషనర్ వైఖరి చర్చనీయాంశమైంది. ఆమె బదిలీ అయినా రిలీవ్ చేయకుండా ఆపిన కమిషనర్.. తాజాగా ఖాళీ అయిన ఎస్ఈ బాధ్యతలను మాత్రం ఆమెకు అప్పగించలేదు. ఆమెకన్నా జూనియర్లుగా ఉన్న ఇద్దరు ఈఈలకు సూపరింటెండెంట్ ఇంజనీర్లుగా ఎఫ్ఏసీ బాధ్యతలు ఇచ్చి, సదరు సీనియర్ మహిళా అధికారిని మాత్రం ఈఈగానే కొనసాగించడంపై సదరు అధికారి తీవ్ర మనస్తాపానికి గురవుతున్నట్లు సమాచారం. సొంత శాఖలోనే నిబంధనలకు విరుద్ధంగా, సీనియర్లను పకనబెట్టి రిటైర్డ్ అధికారులకు కొమ్ముకాస్తున్న వైనంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి.