మణికొండ, మే 19: హలో.. ఈరోజు రాయల్ చాలెంజ్ టీం విన్నింగ్ బెట్టింగ్‌పై రూ. ఐదువేలు వేస్కో… ఫస్ట్ సిక్స్‌పై రూ.వెయ్యి పెట్టేస్కో… సిక్స్ మిస్సా… వెయ్యి మిస్సే… కాదు కాదు సిక్స్ కొట్టిండా..? అయితే రూ. రెండు వేలు ఇచ్చుకో.. అంటూ.. ఇలా నిత్యం వందలాది ఫోన్లు నగర శివారు ప్రాంతాల్లో మోగుతున్నాయి. యువత ఈ బెట్టింగ్ మాఫియాలో కూరుకుపోయి బంగారు భవిష్యత్‌ను నాశనం చేసుకుంటున్న వైనమిది. నార్సింగి, మణికొండ, హైదర్షాకోట్, మంచిరేవుల, పుప్పాల్‌గూడ, కోకాపేట, ఖానాపూర్, గండిపేట, వట్టినాగులపల్లి తదితర గ్రామాల్లోని కొంత మంది యువత ఐపీఎల్ క్రికెట్ బెట్టింగులకు దాసోహమవుతున్నారు.
కొన్ని రోజుల కిందట గ్రామాల్లో పర్యటించిన బెట్టింగ్ రాయుళ్లు స్థానిక యువకులకు బెట్టింగ్‌లపై అవగాహన కల్పించినట్టు తెలిసింది. క్రికెట్ మ్యాచ్ షురూ అయిన క్షణం నుంచి నలుగురు కలిసి టీవీ ముందు కూర్చొని ఫలానా టీం పక్షాన తన బెట్టింగింత.. అంటూ యథేచ్ఛగా గ్రామాల్లో బెట్టింగులు నిర్వహిస్తున్నారు. వంద నుంచి మొదలైన ఈ వ్యవహారం.. ప్రస్తుతం పదివేలు, ఇరవై వేల నుంచి లక్ష రూపాయల వరకు జరుగుతుందంటే.. పరిస్థితి ఎంతవరకు వెళ్లిందో అర్థం చేసుకోవచ్చు. ఈ బెట్టింగు మాఫియా కారణంగా చాలామంది యువత అప్పులు చేసి తల్లిదండ్రులకు తీరని ఇబ్బందులను తెచ్చి పెడుతున్నారు. కొన్ని కుటుంబాల్లో ఆత్మహత్యల వరకు కూడా వెళ్తుందని పలువురు తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం
చేస్తున్నారు.
మ్యాచ్ మొదలయ్యిందంటే చాలు సెల్ఫోన్లలోనే బెట్టింగులు షురూ చేస్తున్నారు. ఈ రోజు మ్యాచ్‌పై తన వాటా.. లేదా తమ నలుగురి బెట్టింగింతా.. అంటూ సదరు వ్యక్తులకు ఫోన్లు చేయడం.. మ్యాచ్ గెలిచినా, ఓడినా ఆ గ్రూపంతా ఓ చోట కలుసుకుని డబ్బులను పంచుకోవడం శివారు గ్రామాల్లో పరిపాటిగా మారింది.
పోలీసులు, ఎస్ఓటీ, ప్రత్యేక బృందాలున్నప్పటికీ ఈ బెట్టింగుల వ్యవహారాలపై పెద్దగా పట్టించుకోవడం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. గ్రామాల్లో సాయంత్రం అయ్యిందంటే చాలు యువకులు గ్రామ శివారుల్లో ప్రత్యేకంగా గదులను ఏర్పాటు చేసుకుని, అందులో టీవీలు పెట్టుకుని బెట్టింగులు నడిపిస్తున్నారు. గత ఐపీఎల్ సీజన్లో హైదర్షాకోట్లో ఓ బెట్టింగ్ ముఠాను ఎస్ఓటీ పోలీసులు పట్టుకుని వారివద్ద నుంచి భారీగా నగదును స్వాధీనం చేసుకున్నారు.
ఇక నార్సింగి, మణికొండ, మంచిరేవుల, పుప్పాల్‌గూడ తదితర ప్రాంతాల్లో ఏకంగా పలు అపార్టుమెంట్లలోనే యథేచ్ఛగా బెట్టింగులు నిర్వహిస్తుండగా, ఖానాపూర్, వట్టినాగులపల్లి ప్రాంతాల్లో చిన్న చిన్న కిరాణా దుకాణాల్లో యువత బెట్టింగులు కాస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఇప్పటికైనా పోలీసు ఉన్నతాధికారులు స్పందించి బెట్టింగు రాయుళ్లపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.