మాదాపూర్, జూన్ 29: త్రీడీ ప్రింటింగ్ నుంచి పారిశ్రామిక రోబోటిక్స్ వరకు ప్రదర్శించబడుతున్న ఆవిష్కరణలకు ఎంతో భవిష్యత్తు ఉందని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. మాదాపూర్‌లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో ఏర్పాటు చేసిన తెలంగాణ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఎఫ్‌టీసీసీఐ) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇండస్ట్రియల్ ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ ఎక్సో (ఐఐటీఈ ఎక్స్) 2025 కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి విచ్చేసి నిర్వాహకులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… రాష్ట్ర పారిశ్రామిక ఉత్పత్తి సూచిక 2.90% కాంపౌండ్ నెలసరి గ్రోత్ రేట్‌ను నమోదు చేసిందని తెలిపారు. ఇది జాతీయ సగటుకు 0. 52 శాతం కంటే ఆరు రేట్లు ఎక్కువ అని చెప్పారు. ఎంఎస్ఎంఈ ఎగుమతి ప్రమోషన్ కౌన్సిల్ అధ్యయనం ప్రకారం… దాదాపు రూ.75 వేల కోట్ల విలువైన పారిశ్రామిక ప్రతిపాదనలను పూర్తి చేసిందన్నారు. లైఫ్ సైన్సెస్ రూ. 40వేల కోట్ల పెట్టుబడులను, 150 కొత్త ప్రాజెక్టులను ఆకర్షించినట్లు తెలిపారు. దీనివల్ల 51 వేలు, 1.5 లక్షల పరోక్ష ఉద్యోగాలను సృష్టించిందన్నారు.
అనంతరం ఉత్తమ పారిశ్రామికవేత్తలకు మెమొంటోలను అందజేశారు. ఇందులో 110కి పైగా ఎగ్జిబిటర్లు, మొబిలిటీ పునరుత్పాదక శక్తి, ప్యాకేజింగ్, స్మార్ట్ టెక్, ఫుడ్ ప్రాసెసింగ్, కోల్డ్ స్టోరేజ్, మెషిన్ టూల్స్, ఇండస్ట్రియల్ ఆటోమేషన్, టీ హబ్, టీ వర్క్స్, సీడీఎస్‌సీ, సైబర్ ఎక్సలెన్స్, ఎంఎస్ఎంఈ, నీతి ఆయోగ్, ఇన్వెస్ట్ ఇండియా, ఎన్ఎస్ఐసీ, తెలంగాణ రెడ్ కో, ఆర్ఐసీహెచ్, ఏఐసీలతో పాటు మరిన్ని స్టార్ట్‌ప్‌లను కలిగి ఉన్న స్టాల్స్ లను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో ఎఫ్‌టీసీసీఐ అధ్యక్షుడు, డా. సురేశ్ కుమార్ సింగల్, తదితరులు ఉన్నారు.