సిటీబ్యూరో, అక్టోబర్ 25 (నమస్తే తెలంగాణ): ఇన్వెస్ట్మెంట్ యాప్‌ల ద్వారా అమాయకులను మోసం చేసి సేకరించిన రూ. 903 కోట్లను హవాలా ద్వారా విదేశాలకు పంపించిన చైనా సైబర్ చీటింగ్ ముఠాకు సంబంధించిన కేసులో ఫిలిప్పీన్స్ లింక్‌లు బయటపడ్డాయి. మంగళవారం నగర పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అదనపు సీపీ ఏఆర్ శ్రీనివాస్, జాయింట్ సీపీ గజారావు భూపాల్, ఏసీపీ కేవీఎం ప్రసాద్ వివరాలు వెల్లడించారు. రెండు వారాల కిందట అరెస్టు చేసిన ముఠా సభ్యుల వద్ద స్వాధీనం చేసుకున్న ఫోన్లు, బ్యాంక్ ఖాతాల వివరాలు, కోర్టు అనుమతితో నిందితులను విచారించగా.. కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయని తెలిపారు. తాజాగా రెండు వేర్వేరు కేసుల్లో ఐదుగురిని అరెస్టు చేసినట్లు చెప్పారు.
గేమింగ్ యాప్‌లో…
నగరానికి చెందిన నాగ ప్రసాద్ ఐపీఎల్విన్ అనే బెట్టింగ్ యాప్‌లో ఆన్లైన్ గేమ్‌లు అడి రూ. 20 లక్షలు పోగొట్టుకున్నాడు. ఆ యాప్‌లో నిర్వాహకులతో చాట్ చేసే ఆప్షన్ కూడా ఉంది. తాను పెట్టుబడి పెడితే డబ్బంతా పోయిందంటూ చాటింగ్‌లో నాగ ప్రసాద్ నిర్వాహకులపై సీరియస్ అయ్యాడు. నిర్వాహకులలో ఒకరైన ఫిలిప్పీన్స్‌లో ఉండే అలెన్.. ప్రసాద్‌తో చాట్ చేశాడు. నీవు గేమ్ అడి డబ్బు పోగొట్టుకున్నావు.. దానికి నేను ఏమి సహాయం చేయలేనంటూ చెప్పాడు. అయితే, నీకు ఒక ఉద్యోగం ఇస్తాను.. నీవు నాకు బ్యాంకు ఖాతాలు తెరిచి, సిమ్‌కార్డును పంపిస్తే సరిపోతుందని చెప్పాడు. ఇందుకు నెలకు రూ. 60 వేల జీతం ఇస్తానని చెప్పాడు. నేను చెప్పే చిరునామాకు వాటిని పంపించు అని సూచించాడు.
ముంబైలో ఉన్న తైవాన్‌కు చెందిన చు చున్ -యు (రెండు వారాల కిందట అరెస్టయ్యాడు) కు పంపించాలని సూచించాడు. అయితే, నీవు ఫోన్లో కాకుండా వీఓఐపీ (వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రోటో కాల్) కాల్స్‌లో మాట్లాడాలని, అందుకు సంబంధించిన పరికరాలను కూడా పంపించాడు. ఈ క్రమంలోనే సిమ్‌కార్డు, బ్యాంకు ఖాతా తెరిచి, ముంబై చిరునామాకు పంపించాడు. ఈ క్రమంలోనే రామ్ అనే వ్యక్తికి కూడా అలెన్ పరిచయమై బ్యాంక్ ఖాతాలు తీసుకున్నాడు. రామ్ తన పేరుపై కాకుండా అనిల్‌కుమార్ పేరుపై ఖాతా తెరిచి పంపించాడు. అలాగే, సాగర్ అనే వ్యక్తి తన స్నేహితుడైన శ్రీనివాస్‌తో మాట్లాడి, శ్రీనివాస్ భార్య పేరుతో ఒక కరెంట్ ఖాతాను తెరిచి పంపించాడు. ఈ బ్యాంక్ ఖాతాలకు సంబంధించిన ఇంటర్నెట్ బ్యాంకింగ్ వివరాలు తీసుకున్న అలెన్, చు చున్లు అందులో బాధితులు నగదు డిపాజిట్ చేయగానే ఇతర ఖాతాలకు బదిలీ చేస్తూ వెళ్లారు. దర్యాప్తులో భాగంగా ఇప్పటికే అరెస్టయిన తైవాన్‌కు చెందిన చు చున్‌కు సంబంధించిన సెల్ఫోన్లు, అతడి వద్ద సేకరించిన బ్యాంకు ఖాతాల వివరాలను విశ్లేషిస్తుండగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో నాగ ప్రసాద్, రామ్, సాగర్, శ్రీనివాస్‌ను పోలీసులు అరెస్టు చేశారు.
ఇమ్రాన్ అరెస్టు..
రూ. 903 కోట్లను హవాలా ద్వారా ఇతర దేశాలకు తరలించేందుకు ఏజెంట్లుగా హైదరాబాద్‌కు చెందిన సయ్యద్ సుల్తాన్, మిర్జానా దీమ్ బేగ్, పర్వీజ్ వ్యవహారించారు. దుబాయ్‌లో ఉంటున్న ఇమ్రాన్ పాత్ర కూడా బయటపడింది. దీంతో ఇమ్రాన్‌పై పోలీసులు గతంలోనే లుక్ఔట్ నోటీస్‌ను జారీ చేశారు. ఈ క్రమంలోనే ఇమ్రాన్ దుబాయ్ నుంచి ముంబైకి వచ్చాడు. ముంబై పోలీసులు అదుపులోకి తీసుకొని, హైదరాబాద్ సైబర్‌క్రైమ్ పోలీసులకు అప్పగించారు.