మలక్ పేట, జూలై 16: మూసారాంబాగ్‌లోని శాలివాహన నగర్ పార్కు వద్ద సీపీ ఐ నాయకుడు కేతావత్ చందు నాయక్ రాథోడ్‌ను కాల్చి చంపిన కేసులో పోలీసు లు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ హత్య కేసులో ప్రధాన నిందితులు రాజేశ్ అలియాస్ రాజన్న, ప్రశాంత్, ఏడుకొండలు, మరో వ్యక్తి కాగా, మరో ఐదుగురు కందు ల సుధాకర్, రాయుడు, మున్నా అలియాస్ మహమ్మద్ మున్నా, రవీంద్రాచారి, యాదిరెడ్డి లు పరోక్షంగా వీరికి సహకరించినట్లు తెలుస్తోంది. అయితే ప్రధాన నిందితులు మంగళవారం కాల్పులు జరిపిన అనంతరం కారును సెల్ఫ్ డ్రైవింగ్ ఏజెన్సీకి అప్పగించి.. పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు సమాచారం ఉన్నప్పటికీ, పోలీసులు మాత్రం ధ్రువీకరించడం లేదు.
ప్రధానంగా ఈ హత్య కుంట్లూరు రావి నారాయణరెడ్డి నగర్ కాలనీ సమీపంలోని ప్రభుత్వ భూమిలో వేసిన గుడిసెల విషయంలో జరిగిన ఆర్థిక లావాదేవీలతోనే జ రిగినట్లు తెలుస్తున్నది. రాజన్న, కందుల సుధాకర్, మున్నా, రవీంద్రాచారి, యాదిరెడ్డిలు గుడిసె వాసుల వద్ద అక్రమంగా డబ్బులు వసూలు చేయడాన్ని చందు నాయక్ తీవ్రంగా వ్యతిరేకించి.. వారు వేయించిన గుడిసెలను కూల్చి వేయించడంతో ఇరువురికి మధ్య తీవ్రస్థాయిలో గొ డవలు జరిగినట్లు సమాచారం. దాంతో చందునాయక్‌పై కోపం పెంచుకున్న రాజ న్న, అతని సహచరులు చందు నాయక్ హత్యకు కుట్ర పన్నినట్లు తెలుస్తున్నది.
గతంలో చందు నాయక్‌తో కలిసి పనిచేసిన రాజన్న అతని సహచరులు అనేక భూ సెటిల్మెంట్లు కూడా చేశారని, అయితే వాటి కి సంబంధించిన డబ్బులు రాజన్నకు ఇస్తానని చందు నాయక్ ఇవ్వకపోవడంతో వారిమధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నట్లు సమాచారం. 2011లో సాయినగర్‌లోని ప్రభుత్వ భూమిలో గుడిసెలు వేయించి వారికి పట్టాలు ఇప్పించడంలో చందు నాయక్ ప్రధాన పాత్ర పోషించగా, అక్కడ కూడా పలువురితో విభేదాలు తలెత్తినట్లు సమాచారం. పాత కక్షలు, భూ వివాదాలు, ఆర్థిక లావాదేవీల విషయంలోనే ఈ హత్య జరిగినట్లు తెలుస్తోంది. దాంతోపాటు అక్రమ సంబంధం కూడా ఈ హత్యకు కారణమై ఉండొచ్చునని పోలీసులు భావిస్తున్నట్లు సమాచారం. నిందితులను పట్టుకోవడం కోసం పది ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు సీఐ నరేశ్ తెలిపారు. కాగా.. 9 మంది నిందితులు పోలీసుల అదుపులోఉన్నట్లు సమాచారం.